తాడేపల్లి ప్యాలస్‌ ఎదుట బోరుగడ్డ ధర్నా!

Borugadda Anil protest

వైసీపీ నుంచి బహిష్కరింపబడిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ గురించి కొత్తగా పరిచయం అవసరమే లేదు. ఆయనని పోలీసులు ‘రౌడీ షీటర్’ అని పేర్కొంటూ కేసులు నమోదు చేయడం పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ వైసీపీలో నం:2గా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి తనను ‘రౌడీ షీటర్’ అని దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్‌ బోరున విలపిస్తున్నారు.

బోరుగడ్డ అనిల్ కుమార్‌ ఈరోజు ఉదయం తన భార్యతో కలిసి తాడేపల్లి ప్యాలస్‌ ఎదురుగా కూర్చొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “నేనేమీ రౌడీ షీటర్ కాను. లండన్‌లో పీజీ చేశాను. మా తండ్రి మరణించిన తర్వాత ఆంధ్రాకు వచ్చేసి వైసీపీలో చేరాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు కష్టపడి పనిచేస్తానని వైఎస్సార్ సమాధి మీద ప్రమాణం చేశాను. దానికి కట్టుబడి పార్టీలో కష్టపడి పనిచేశాను.

ADVERTISEMENT

పోలీసులు నాపై కేసులు నమోదు చేసినప్పటికీ హైకోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది. నన్ను ‘రౌడీ షీటర్’ అని అవహేళన చేసినవారికి లీగల్ నోటీసులు పంపాను. అలాగే 12 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి తన అనుచరుల చేత నాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయిస్తూనే ఉన్నారు.

నేను మా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తే, సజ్జల రామకృష్ణా రెడ్డి అనుచరులు నన్ను లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. పార్టీ కోసం ఇంతగా కష్టపడితే ఇంతగా అవమానిస్తారా?” అంటూ బోరుగడ్డ అనిల్ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది వరకు విజయసాయి రెడ్డి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించినప్పుడు ఆయన కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. “తాడేపల్లి ప్యాలస్‌లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ బలమైన కోటరీ ఉందని, దానిని దాటుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం అసాధ్యమన్నారు. ఆ కోటరీలో ఉన్నవాళ్ళే జగన్మోహన్ రెడ్డికి-పార్టీ నేతలు, శ్రేణులకు, జగన్‌కు-ప్రజలకు మధ్య దూరం పెంచారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

వారి వల్లనే జగన్‌ తన పట్ల కూడా చాలా అవమానకరంగా వ్యవహరించేవారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నాకు గౌరవం లేని చోట ఉండలేనంటూ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

నిజానికి అప్పటికీ అయన వైసీపీలో చాలా కీలక నేతగా ఉండేవారు. ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా మౌనంగా భరిస్తూ జగన్‌కి వీర విధేయుడుగా ఉండేవారు. ముఖ్యంగా ఢిల్లీలో పైరవీలు చేస్తూ తోడ్పడేవారు. వైసీపీలో నం.2గా ఉన్న ఆయనకే అవమానాలు తప్పలేదు. వాటిని భరించలేక పార్టీని వీడారు.

‘ఆ స్థాయిలో ఉన్న నేతని, సొంత కుటుంబ సభ్యులనే కోటరీ పొగపెట్టి బయటకు పంపేసినప్పుడు, నేనొక లెక్కా?’ అని బోరుగడ్డ అనిల్ కుమార్‌ గ్రహించి ఉంటే నేడు ఇలా ధర్నా చేసేవారే కారు.

బోరుగడ్డకి ఇప్పుడు పార్టీ లేదు. దాని అండదండలు లేఉ. కానీ దాని కోసం పెట్టించుకున్న కేసులు మాత్రం అలాగే మిగిలున్నాయి.

ADVERTISEMENT
Latest Stories