ఓటమి నేర్పిన గుణపాఠాలు వైసీపీ నేతల మైండ్ కి ఎక్కుతున్నట్టుగా కనిపించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి తాజాగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు వైసీపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్ల స్పష్టమైన తీర్పును కళ్లారా చూసాక కూడా ఆ పార్టీ నేతల ప్రకటనలలో మార్పు కనిపించడం లేదు.
తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, విజయనగరం వైసీపీ ఇంచార్జ్ బొత్స సత్యనారాయణ లో కూడా పార్టీ ఓటమి తాలూకా అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బొత్స బంధువు, వైసీపీ పార్టీ కీలక నేత చిన్న శ్రీను వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరడం,
ఆ తరువాత మరికొంతమంది నేతలు కూడా చిన్న శీను ను అనుసరిస్తూ వైసీపీ ని వీడడం, దానికి తోడు తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స కుమార్తె అనూష ఓటమి, విజయనగరం జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్…ఇలా ఎటువైపు చూసిన అటు పార్టీ పరంగా ఇటు వ్యక్తిగత ఇమేజ్ పరంగా బొత్స కు ఓటమే ఎదురవుతుంది.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో బొత్స కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే మైండ్ సెట్ మార్చుకోవాల్సి వస్తుందని, ఇక పై ఈక్వాలిటీ రాజకీయాలు పనికి రావని, ఇక నుంచి అయ్యో పాపం అనే పరిస్థితి ఉండదని,
కక్ష పూరిత రాజకీయాలు చేసేవారికి భవిష్యత్ లో గట్టిగా బుద్ది చెపుతామని, అటువంటి వారికీ చుక్కలు చూపిస్తామని, ఇవే మాటలు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూడా చెప్పినట్టు బొత్స చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే బొత్సలో కనిపించిన ఈ ఆవేశం, ఆక్రోశం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏమిటి.? అందుకు కారణం ఎవరు.? చిన్న శీను రాజీనామానా.? కుమార్తె అనూష ఓటమా.? విజయనగరం జిల్లాలో వైసీపీ రాజకీయ పతనమా.? ఇటువంటి వ్యాఖ్యలు, ప్రకటనలే ఒకరకంగా వైసీపీ ని రాజకీయంగా పతనం దిశగా నడిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఇప్పటికి భవిష్యత్ లో అధికారంలోకి వస్తే రప్ప రప్ప అంటూ, చుక్కలు చుపిస్తామంటూ రెచ్చిపోతుంటే జగన్ 2.0 కి అవకాశం ఉంటుందా.?






