బాక్సాఫీస్ వద్ద ఒకేసారి పెద్ద సినిమాలు తలపడటం ఒకప్పుడు అంత రిస్క్ అనిపించేది కాదు. ఎందుకంటే వినోదానికి పెద్దగా ఆప్షన్లు ఉండేవి కాదు. కొత్త రిలీజులు ఎలా ఉన్నాయో క్షణాల్లో తెలిసిపోవడానికి సోషల్ మీడియాలు, ఓవర్సీస్ ప్రీమియర్లు లేవు. కానీ ఇప్పుడలా కాదు. నాలుగైదు క్లాష్ అవుతున్నాయంటే ఏది తేడా కొట్టినా దాని నిర్మాత పడే నరకం, చవి చూసే నష్టాలు మాములుగా ఉండవు.
అందుకే ప్లానింగ్ చాలా అవసరం. ఏడాది పొడవునా ఒక్క సంక్రాంతి మాత్రమే బడా స్టార్ల ట్రాఫిక్ ని తట్టుకునే స్టామినా కలిగిన సీజన్.ఈసారి ఆగస్ట్ 15 లాంగ్ వీకెండ్ ని భారీ ఎత్తున టార్గెట్ చేసుకోవడం డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు కొత్త సవాల్ తెచ్చేలా ఉంది. 10న సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ వస్తుంది. ఒకప్పటి మార్కెట్ తలైవాకు తెలుగులో లేకపోయినా సరైన కథ దర్శకుడు పడితే ఒక్కసారిగా లేచి కూర్చునే ఇమేజ్ ని తక్కువంచనా వేయలేం.
ఒక రోజు ముందు రావడం వల్ల సన్ పిక్చర్స్ చాలా తెలివైన ఎత్తుగడ వేసింది. అసలు చిక్కు ఆగస్ట్ 11న ఉంటుంది. చిరంజీవి భోళా శంకర్ మీద వేదాళం రీమేక్, దర్శకుడు మెహర్ రమేష్ కావడం వల్ల ఇప్పటికే నెగటివిటీ ఉంది. అలా అని తేలికగా తీసుకోవడానికి లేదు. రొటీన్ క్రింజ్ మాక్స్ మసాలాలు వర్కౌట్ అవుతాయని వాల్తేరు వీరయ్య చూపించింది కానీ ఆ పండగ అడ్వాంటేజ్ ఆ స్థాయిలో ఈసారి ఉండదు.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సందీప్ రెడ్డి బ్రాండ్ మీద ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న యానిమల్ లో హీరో రన్బీర్ కపూరే అయినా అందులో ఉన్న వయొలెంట్ కంటెంట్ అన్ని బాషల మాస్, యూత్ కి కనెక్ట్ అయ్యేదే. అర్జున్ రెడ్డిలో కాలేజీ స్టూడెంట్ నే అంత యారొగెంట్ గా చూపించిన సందీప్ ఇక గ్యాంగ్ స్టర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చెప్పడం కష్టం. ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న గదర్ 2 మీద మెల్లగా హైప్ పెరుగుతోంది.
భారతదేశపు అతి పెద్ద టాప్ 5 బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన ఈ సినిమా కొనసాగింపంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఎటొచ్చి అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మీద మాత్రమే కాస్త తక్కువ హైప్ కనిపిస్తోంది. ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తం కలిపి ఆరు వందల కోట్లకు పైగానే బిజినెస్ డీల్స్ జరుగుతాయి. ఆడియన్స్ కి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా వాళ్ళు చూసేది ఒకటో రెండో. అవి కూడా హిట్టయిన వాటిని మాత్రమే. మరి ఇంత రిస్క్ చేసి తలపడుతున్న యుద్ధంలో ఓడిపోయే సైనికులు ఎవరో, గెలిచే రాజులు ఎవరో.





