‘పల్లకిలో పెళ్లి కూతురు’, ‘వారెవా’, ‘బసంతి’ చిత్రాల్లో హీరోగా నటించిన బ్రహ్మానందం వారసుడు గౌతమ్ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తండ్రి క్రేజ్‌ను వాడుకోవడంలో విఫలం అయ్యాడు. ఈయన నటించిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో గౌతమ్‌ను హీరోగా పనికి రాడు అంటూ కొందరు తేల్చేశారు. అయితే గౌతమ్ మాత్రం హీరోగా నిరూపించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తాను అంటున్నాడు. ‘బసంతి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.
రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ప్రేమ కథా చిత్రాన్ని గౌతమ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో గౌతమ్‌ను కొత్తగా చూపిస్తాను అంటూ రమేష్ చెబుతున్నాడు. కొంత కాలం గ్యాప్ తీసుకున్న గౌతమ్ పలు కథలను వినడంతో పాటు నటనలో మరింతగా శిక్షణ పొందాడట. యాక్షన్ మరియు డాన్స్‌లలో కూడా కొత్త గౌతమ్‌ను చూస్తారట. మొత్తానికి ఈసారి సక్సెస్ కొట్టాలనే గట్టి పట్టుదలతో గౌతమ్ ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.





