పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ కి సెలెబ్రేషన్. ఈసారి సాయి తేజ్ తోడయ్యాడు. రీమేక్ కావడం వల్లనో లేక పవర్ స్టార్ ది క్యామియో తరహాలో ఉంటుందన్న ప్రచారమో మొత్తానికి బ్రో విషయంలో హడావిడి కనిపించని మాట వాస్తవం. సరే పవన్ బ్రాండ్ మీద యావరేజ్ కంటెంట్ పడినా చాలు బ్లాక్ బస్టర్ వసూళ్ల వస్తాయనే నమ్మకం అతి తక్కువ టైంలో బ్రో లాంటివి తీసేందుకు ప్రేరేపిస్తుంది.
కథ మరీ కొత్తగా ఉండదు. మార్క్(సాయి తేజ్) అనే మిడిల్ క్లాస్ ఉద్యోగి ఒక యాక్సిడెంట్ కు గురైతే మనిషి రూపంలో టైం దేవుడు(పవన్ కళ్యాణ్) వచ్చి అతను నెరవేర్చాల్సిన బాధ్యతను దగ్గరుండి పూర్తి చేయిస్తాడు. జీవిత సత్యాలను అతనికే కాదు ప్రేక్షకులకూ భోదిస్తాడు. మధ్యలో ఈ ఇద్దరి మధ్య బాండింగ్, సరదా సన్నివేశాలు, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు వగైరా ఉంటాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏరికోరి బ్రో రచన బాధ్యతలు తీసుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ వినోదయ సితంలో నటించిన సముతిరఖని, తంబి రామయ్యల పాత్రలను పవన్,తేజు ఇమేజ్ లకు తగ్గట్టు మార్చాలి. వాళ్ళిద్దరి కాంబినేషన్ కు న్యాయం జరిగే సీన్లు పండాలి. క్లైమాక్స్ ముందు నుంచి మనిషి చావు పుట్టుకల సారాన్ని వివరించి మనిషి జన్మ తాలూకు పరమార్థం విడమరిచి చెప్పాలి.
వినడానికి ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తెరపైకి వచ్చేటప్పటికి బ్రోకొచ్చిన ప్రధాన సమస్య పవన్ ఎనర్జీ, స్టైల్ ని ఎలాగైనా సరే వాడుకోవాలని నిర్ణయిచుకోవడం. దీని వల్ల ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని కొన్ని సీన్లు కూడా ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా పవన్ పాత పాటల బిట్లను వాడుకుని అవే కాస్ట్యూమ్స్ తో డాన్సులు చేయించడం అభిమానులకు గూస్ బంప్స్ స్టఫ్ అనే చెప్పాలి
పాత్రల ఎస్టాబ్లిష్మెంట్లు, లైట్ కామెడీతో ఇంటర్వెల్ దాకా నెట్టుకొచ్చిన సముతిరఖని సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పేశారు. సులభంగా ఊహించగలిగే కథా కథనాలతో పాటు అంతగా కనెక్ట్ కానీ ఎమోషన్లతో క్లైమాక్స్ వైపు ప్రయాణించడం ఫీల్ ని తగ్గించేసింది. ఒకవేళ మొదటి సగంలో కేవలం వినోదం కాకుండా భావోద్వేగాల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బ్రో ఇంపాక్ట్ ఇంకో స్థాయిలో ఉండేది
టాలీవుడ్ టాప్ రైటర్స్ లో అగ్ర స్థానంలో ఉన్న త్రివిక్రమ్ నుంచి ప్రతి మాటా గొప్పగా ఉండాలని ఆశించడం తప్పు కాదు. కానీ ఇందులో అవసరం లేని చోట ప్రాసల కోసం పడిన ప్రయాస కనిపిస్తుంది. జీవన పరమార్థాన్ని ఒక ఆధునిక వేదాంతంలో చెప్పాలని ప్రయత్నించిన గురూజీ అంతే గొప్పగా మిగిలిన అంశాలను బ్యాలన్స్ చేసి ఉంటే క్లైమాక్స్ ఘట్టంలో అందరి కళ్ళు చెమర్చేవి.
పవన్ స్వాగ్, అల్లుడు తేజుతో కెమిస్ట్రీ, కొంత ఫన్, తమన్ బిజిఎం సానుకూలంశాలుగా పని చేసినప్పటికీ బ్రోకు కావాల్సిన హైని త్రివిక్రమ్, సముతిరఖనిలు పూర్తి సంతృప్తికరంగా డిజైన్ చేసుకోలేకపోయారు. అందువల్లే గోపాల గోపాల చూసినప్పుడు వచ్చిన ముప్పాతిక శాతం ఆనందం ఇందులో పావు వంతుకు పడిపోయింది. ఆ మాత్రం చాలు పవన్ కోసం చూసేస్తాం అనుకుంటే ఓకే బ్రో.



