తెలంగాణలో గత రెండు ఎన్నికలలో బిఆర్ఎస్ ధాటిని తట్టుకొని ఢీకొనేవారు లేకపోవడంతో వరుసగా రెండుసార్లు గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారు. మరోసారి కూడా బిఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం బాగానే ఉంది.
కానీ ఈసారి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా బలం పుంజుకోవడంతో బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఈయబోతోంది. బిఆర్ఎస్‌తో సహా ఇతర పార్టీలలో గెలుపు గుర్రాలని భావించే అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు.
వారందరూ కాంగ్రెస్‌లో చేరుతుండటం కలిసి వచ్చే అంశం కాగా, వారి చేరికలు తెలంగాణ ప్రజలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలువబోతోందనే నమ్మకం కల్పిస్తున్నాయి. అయితే ప్రజలలో ఏర్పడిన ఈ నమ్మకాన్ని, కాంగ్రెస్‌లో కనిపిస్తున్న ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు ఇలాగే కొనసాగించగలిగితే గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, ఈ తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసిందో, ఎన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తోందో ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. అనుభవిస్తున్నారు కూడా. కనుక కేసీఆర్‌ని కాదని కాంగ్రెస్‌ను తెచ్చుకోవడానికి బలమైన కారణాలు ఏవీ కనబడటం లేదు. పైగా కాంగ్రెస్ పాలన ఏవిదంగా ఉంటుందో ఇదివరకే రుచి చూసేశారు. కనుక కాంగ్రెస్ ఎంత పుంజుకొన్నప్పటికీ ప్రజలు దానిని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహాల ముందు కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలు ఎందుకు పనికిరావని ఇదివరకే నిరూపితమైంది. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే మంచి మాటకారులని పేరుండేది. కానీ ఇప్పుడు బిఆర్ఎస్‌లో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలను ఆకట్టుకొనేలాగా మాట్లాడగలుగుతున్నారు. ఈ 9 ఏళ్ళలో వారందరూ చాలా బలపడ్డారు కూడా. అన్నిటికంటే ముఖ్య విషయం ఏమిటంటే, బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో డబ్బు ఖర్చుకి వెనకాడదు. కనుక బిఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు చాలా ఉన్నాయి.
రెండు మూడు నెలల క్రితం వరకు తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉండేది. కానీ కొన్ని స్వయంకృతాపరాధాల వలన ఇప్పుడు కాంగ్రెస్ కంటే వెనకబడిపోయింది. అయినప్పటికీ దాని వెనుక అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు ఏకపక్షం కాబోవు. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ తప్పదు.



