కేసీఆర్‌ తెలంగాణకు దూరంగా వెళ్ళగలరా?

 Can KCR go away from Telangana?తెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన బహిరంగసభలో కూడా మళ్ళీ అదే చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం హైవోల్టేజ్ రాజకీయాలు సాగుతున్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణ గడప దాటి బయటకు వెళ్ళగలరా?అంటే చాలా కష్టమనే చెప్పవచ్చు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల కోసం ఢిల్లీ లేదా మరో రాష్ట్రానికి వెళ్ళినట్లయితే అది లిక్కర్ బిజినెస్ డీల్స్ కోసమే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ దానిని అందిపుచ్చుకొని కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ వ్యవహారంలో నిజంగా ఆమెకు ప్రమేయం ఉందా లేదా?అనేది ముఖ్యం కాదు. ఉందని గట్టిగా వాదిస్తుంటే చాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లిపోతాయి. బండి సంజయ్‌ ఇప్పుడు అదే చేస్తున్నారని చెప్పవచ్చు. కనుక ఈ పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ విడిచి బయటకు వెళితే దానిని బండి సంజయ్‌ మరో అవకాశంగా మలుచుకొనే ప్రమాదం ఉంది.

ఇక మునుగోడు ఉపఎన్నికలు ముంచుకొస్తున్న ఈ సమయంలో కేసీఆర్‌ హైదరాబాద్‌ విడిచి బయటకు వెళితే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలను బిజెపి లాగేసే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో 40 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు చొప్పున కొనుగోలు చేసేందుకు బిజెపి సిద్దపడినట్లు వార్తలు వస్తున్నాయి. కనుక తెలంగాణలో కూడా బిజెపి అటువంటి ప్రయత్నం చేయదనుకోలేము. తెలంగాణ బిజెపి ప్రత్యేకంగా దీని కోసమే ‘చేరికల సమన్వయ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసుకొంది కూడా. కేసీఆర్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఈటల రాజేందర్‌ ఆ కమిటీలో సభ్యుడు. ఆయన గుట్టుగా తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్ గనుల కేటాయింపులలో అక్రమాలకు పాల్పడినందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఇక ఇవ్వాళ్ళే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. సిఎం కేసీఆర్‌ కుటుంబం కూడా భారీ అవినీతికి పాల్పడిందని, సమయం వచ్చినప్పుడు కేంద్రం చర్యలు తీసుకొంటుందని రాష్ట్ర బిజెపి నేతలు పదేపదే చెపుతున్నారు.

తమ కుటుంబంపై ఈడీ, సీబీఐ, ఐ‌టి శాఖలు దాడులు చేసినా చేయవచ్చని, కానీ వాటికి భయపడబోనని సిఎం కేసీఆరే స్వయంగా చెపుతున్నారు. కనుక అటువైపు నుంచి కేసీఆర్‌కు ప్రమాదం పొంచిఉందనే భావించవచ్చు. సిఎం కేసీఆర్‌ను నలువైపుల నుంచి పద్మవ్యూహంలో బందించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లే ఉంది. కనుక బిజెపిని దాని వెనుక ఉన్న మోడీ, అమిత్‌ షాలను సిఎం కేసీఆర్‌ ఏవిదంగా ఎదుర్కొని నిలబడతారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories