ఆంధ్రప్రదేశ్‌లో ఏటా లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసి పైచదువులకు వెళ్తుంటారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇవి అత్యంత కీలకమైన దశలు. కానీ ఈ దశలో వారికి ఉన్నత చదువులు, వాటితో భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయో మార్గదర్శకత్వం చేసే వ్యవస్థ, యంత్రాంగం మన విద్యావ్యవస్థలో లేదు.
అందువల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నలుగురితో నారాయణ అనుకుంటూ ఏదో ఒకటి ఎంచుకొని ముందుకు సాగిపోతుంటారు. ఈ విధంగా గుడ్డిగా వెళ్లడం వలన భవిష్యత్తులో వారికి ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా అందరూ అదే డిగ్రీలు పట్టుకొని వస్తుంటారు కనుక పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు 10వ తరగతి తర్వాత సైన్స్, ఆర్ట్స్, కామర్స్… ఏ గ్రూప్ ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత డిగ్రీనా, ప్రొఫెషనల్ కోర్సా, స్కిల్ ఆధారిత విద్యనా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యవస్థ లేదు.
ఈ గందరగోళానికి ప్రధాన కారణం… ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే విజయానికి మార్గమనే భావన. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కూడా తమ స్వలాభం కోసం ఈ రెండు కోర్సులలోకే విద్యార్థులను మళ్లిస్తున్నాయి.
వాస్తవానికి నేటి ప్రపంచంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్ సైన్సెస్, లాజిస్టిక్స్, డిజైన్, మీడియా, అనిమేషన్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, స్కిల్ ఆధారిత టెక్నికల్ కోర్సులు వంటి ఎన్నో రంగాలలో భారీగా ఉద్యోగావకాశాలున్నాయి.
కనుక ఆయా రంగాలలో చేరేందుకు తగిన విద్యార్హతలు, నైపుణ్యాలు సంపాదించుకోవాలి. కానీ పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఈ విషయంలో మార్గదర్శనం చేసేవారే ఉండరు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. అక్కడ ‘కెరీర్ కౌన్సెలింగ్’ అన్న పదమే చాలామందికి తెలియదు. స్కూల్ లేదా కాలేజీ స్థాయిలో సరైన గైడెన్స్ లేకపోవడంతో, ఉన్న అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన రావడం లేదు. ఫలితంగా అనేక మంది తాము ఆసక్తి లేని కోర్సుల్లో చేరి, మధ్యలోనే చదువు మానేయడం లేదా నిరాశలో కూరుకుపోవడం చూస్తున్నాం.
నగరాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా, అక్కడ కూడా సమస్య పూర్తిగా తీరలేదు. కోచింగ్ సెంటర్లు ఎక్కువైనా, అవి ఎక్కువగా పోటీ పరీక్షలకే పరిమితం అవుతున్నాయి.
విద్యార్ధుల అభిరుచి, ఆసక్తి, నైపుణ్యాలను గుర్తించి అందుకు తగినట్లు మార్గదర్శనం చేసే వ్యవస్థ అవసరం. విద్యను వ్యాపారంగా మార్చేసిన ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దీనిపై ఆసక్తి ఉండదు. కనుక ప్రభుత్వమే చొరవ తీసుకొని విద్యా వ్యవస్థలో ఉన్నత, సాంకేతిక విద్యలు, ఉద్యోగాలు, ఉపాధి కౌన్సెలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అప్పుడే సరైన విద్య, సరైన ఉద్యోగాలు లభిస్తాయి.







