తెలంగాణలో కొత్త విమానాశ్రయాలకు చంద్రబాబు చొరవ!

Rammohan Naidu

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5 విమానాశ్రయాలు ఉన్నాయి. మరో 5 విమానాశ్రయాల ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏపీలో ఇన్ని విమానాశ్రయాలున్నప్పుడు, గత పదేళ్ళలో ఏపీ కంటే శరవేగంగా చాలా అభివృధ్ది చెందిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ఒక్కటే (శంషాబాద్ విమానాశ్రయం) ఎందుకుంది?అనే సందేహం కలగడం సహజం.

ADVERTISEMENT

సాంకేతిక, పరిపాలన, భూసేకరణ తదితర సమస్యల వలన విమానాశ్రయాల ఏర్పాటు ఆలస్యమవుతోందంటే అర్దం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్‌ రాజకీయాల కారణంగా ఆలస్యం అవడం బాధాకరం.

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ కేసీఆర్‌ నిత్యం ప్రధాని మోడీ, బీజేపిలపై కత్తులు దూస్తూ తన రాష్ట్రానికి తానే నష్టం చేసుకున్నారని చెప్పక తప్పదు. కానీ తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు!

ఈరోజు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్‌ జిల్లా మామూనూరులో రెండున్నరేళ్ళలోగా విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తానని చెప్పారు.

వరంగల్‌ జిల్లా మామూనూరు వద్ద విమానాశ్రయం ప్రతిపాదన చాలా ఏళ్ళుగా ఉంది. దానికి మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియాని ఆదేశించారు.

అలాగే భద్రాచలంలో మరో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీ వచ్చి నివేదిక తయారుచేసి అందజేసిందని అక్కడా వీలైనంత త్వరగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

“ఓ కేంద్రమంత్రిగా కాక ఓ తెలుగువాడిగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏం చేయగలవో అవన్నీ చేయాలని, తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకి గట్టిగా ప్రయత్నించాలని” సిఎం చంద్రబాబు నాయుడు తనకు సూచించారని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

కాంగ్రెస్‌, బీజేపిలు బద్ద శత్రువులైనప్పటికీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తమ పార్టీల రాజకీయాలను పక్కనపెట్టి ప్రధాని మోడీతో సఖ్యతగా, విధేయంగా వ్యవహరిస్తుండటం కూడా తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాల ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యింది.

ముఖ్యంగా కేంద్ర పౌరవిమాన శాఖా మంత్రిగా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడం, కూటమిలో టీడీపీ, బీజేపిలు కలిసి పనిచేస్తుండటం వంటివన్నీ తెలంగాణకు కలిసి వచ్చాయని చెప్పొచ్చు.

ఏపీలో రాజకీయ సమీకరణాలతో తెలంగాణ రాష్ట్రానికి ఈవిదంగా మేలు కలుగుతుండటం చాలా ఆశ్చర్యమే.. చాలా సంతోషమే కదా?

ADVERTISEMENT
Latest Stories