ఒకప్పుడు సినీ తారల వ్యక్తిగత జీవితాలు నాలుగు గోడల మధ్యే ఉండేవి. సినిమాలు, ఇంటర్వ్యూలు, విజయోత్సవాలు మాత్రమే అభిమానులకు కనిపించేవి. కానీ సోషల్ మీడియా యుగం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉదయం తాగిన కాఫీ మొదలు ఆరోగ్య సమస్యలు, కుటుంబ విషయాలు, తమ ఆనందాలు, సినిమాలు, సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాల వరకు ప్రతీ విషయాన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇది వారిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందనడంలో సందేహం లేదు.
ఉదాహరణకు సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి “మా ఇంటి బంగారం”తో సక్సెస్ కొట్టే వరకు అనేక వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. వాటన్నిటి గురించి అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవల “మా ఇంటి బంగారం” సక్సెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ తాను అనేక కష్టాలు అనుభవించానని, కానీ భర్త రాజ్ నిడిమోరు ప్రోత్సాహంతో అన్నిటినీ ఎదుర్కొని విజయం సాధించానని సమంత చెప్పారు.
ఆమె జీవితం తెరిచిన పుస్తకమే. కనుక ఆమె చెప్పినవన్నీ నిజమేనని అందరికీ తెలుసు. ఆమె లాగే పలువురు సెలబ్రెటీలు తమ వ్యక్తిగత, సినీ జీవితం గురించి అభిమానులతో పంచుకుంటారు. కొంతమంది తాము జీవిత భాగస్వాముల నుంచి విడిపోతున్న విషయం కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ విడాకులు తీసుకుంటున్నప్పుడో లేదా ఏదైనా వివాదంలో చిక్కుకున్నప్పుడో “దయచేసి మా వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ మాట్లాడవద్దు. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి” అంటూ మళ్లీ వారే విజ్ఞప్తులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
సినీ పరిశ్రమలో పలువురు సీనియర్, జూనియర్ సెలబ్రెటీలు తమ వ్యక్తిగత, కుటుంబ జీవితాల గురించి అందరితో పంచుకునేందుకు ఇష్టపడరు. అటువంటివారు ఇలాంటి విజ్ఞప్తులు చేస్తే అర్థం చేసుకోవచ్చు.
కానీ తమ జీవితంలో ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో చర్చకు పెట్టి మళ్లీ మా సొంత విషయాలలో జోక్యం చేసుకోవద్దని, చేసుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తలుపులు బార్లా తెరిచి ఎవరూ లోపలకు తొంగి చూడొద్దని కోరుకోవడం దేనికి? ఒకవేళ వద్దనుకుంటే మిగిలిన నటీనటుల మాదిరిగా గోప్యత పాటిస్తే మంచిది కదా?




