‘చలో హైదరాబాద్’ పిలుపుతో ఫ్యాన్స్?

RRR hyderabadఈ సారి సినీ ప్రేమికుల సంక్రాంతి పండగ ఓ వారం ముందే వస్తోంది. జనవరి 7వ తేదీన విడుదల కాబోయే “ఆర్ఆర్ఆర్” కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులు సృష్టించడం ఖాయంగా ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. అయితే ఒక్క ప్రదేశంలో తప్ప!

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల విషయంపై ఇంకా చర్చలు జరుగుతుండడంతో, జనవరి 7వ తేదీ నాటికి వివాదాలన్నీ తొలగి ‘ఆర్ఆర్ఆర్’కు రోడ్ క్లియర్ చేస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి అంశం. అయితే పరిస్థితులు సానుకూలంగా లేని పక్షంలో ‘చలో హైదరాబాద్’ అనేందుకు కూడా ఏపీ సినీ ప్రేమికులు వెనుకాడడం లేదన్నది లేటెస్ట్ సెన్సేషన్.

ADVERTISEMENT

ఇద్దరు మాస్ బలమున్న అగ్ర నాయకులు నటించిన సినిమాగా “ఆర్ఆర్ఆర్”కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మరి ఆ సీన్స్ ను అందరి కంటే ముందుగా చూసేయాలన్న భావన సహజంగానే అభిమానుల్లో ఉంటుంది. ఇందుకోసమే గతంలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం అయ్యేవి. కానీ ప్రస్తుతం ఏపీ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకం కావడంతో, పొరుగున ఉన్న తెలంగాణాలో ‘ఆర్ఆర్ఆర్’ను వీక్షించేయాలన్న ప్లానింగ్ లో ఫ్యాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

దానికి తగ్గట్లుగానే జనవరి 6వ రోజున ప్రీమియర్స్ రూపంలో ‘ఆర్ఆర్ఆర్’ షోలు పెద్ద ఎత్తున వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇదే ధోరణి ఏపీలో అవలంభించాలంటే సాధారణ సమయాలలోనే ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చక్కర్లు కొట్టే అవకాశం ఉంది.

కనుక ఏపీలో ముందు రోజు ఒకటి, రెండు షోల ప్రదర్శన అన్నది సాధ్యం కాకపోవచ్చు గానీ, ఒకవేళ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ ఎంత సంతోషిస్తుందో గానీ, సినీ అభిమానులకు మాత్రం ఊరట లభించినట్లే!

ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పక్కనపెట్టి, నేడు ప్రభుత్వ చర్యలను గమనిస్తే కొద్దిగా మార్పులు చోటు చేసుకోవడం విశేషం. వివిధ కారణాలతో ప్రభుత్వం సీజ్ చేసిన ధియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకుందుకు అనుమతులు ఇవ్వడంతో 83 ధియేటర్లు ఊపిరి పీల్చుకున్నాయి. అంతేగాక ‘ఆర్ఆర్ఆర్’కు నేరుగా ప్రభుత్వమే టికెట్లు అమ్మే విధంగా ప్రణాళికలు సిద్ధమైనట్లుగా సమాచారం.

సినిమా టికెట్లు బుకింగ్ చేసుకునే వినియోగదారులు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా టికెట్ ధరను మాత్రమే చెల్లించే విధంగా నిర్ణయాలు జరిగినట్లుగా, ఈ విధంగా బుకింగ్ కాబోయే తొలిసినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవనుందని ట్రేడ్ వర్గాల నుండి లభించిన సమాచారం. మారుతోన్న పరిణామాలతో ఏపీలో పరిస్థితులు సర్దుమణిగితే పర్లేదు గానీ, లేదంటే ‘చలో హైదరాబాద్’ అనేందుకు ఫ్యాన్స్ అయితే రెడీ!

ADVERTISEMENT
Latest Stories