దశాబ్దాల పాటు కోట్లాది మంది దేశ ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటాలు చేసినందుకు దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశ విభజన సమయంలో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ ఎన్నటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకాలే.
అంతమంది త్యాగాలతో స్వాతంత్ర్యం పొంది, స్వేచ్చగా జీవివిస్తున్న పాలకులు, ప్రజలు వారి త్యాగాలను గౌరవిస్తున్నారా?
అంటే ‘అవును వారి ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొని దండలు వేసి గౌరవిస్తూనే ఉన్నాము కదా?’ అని చెప్పుకోవచ్చు. కానీ వారి త్యాగాలకు ఇదే సరైన గౌరవమా? అంటే కాదని ప్రతీ ఒక్కరికీ తెలుసు.
పాలకులు, రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, చివరికి సామాన్య ప్రజల వరకు ప్రతీ ఒక్కరూ గీత దాటుతూనే ఉన్నారు.
త్రేతాయుగం, ద్వాపరయుగంలోనే ఏదీ సక్రమంగా లేనప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉంటుంది? ఉండదు. కనుక ఈ విపరీత ధోరణుల మద్యనే.. దేశం ఇలాగే.. సాగుతుంటుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాడు భారత్ ఏవిధంగా ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిందో, అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ‘జీరో’నుంచి ప్రారంభించాల్సి వచ్చింది.
యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా సాకగల హైదరాబాద్ నగరం కేసీఆర్ చేతికి లభించినందున ఆయన పదేళ్ళలో తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోగలిగారు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులలో నాడు సిఎం చంద్రబాబు నాయుడు పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్దిపధం వైపు నడిపించారు.
ఒకవేళ అప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుంటే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవిధంగా ఉండేదో ఎవరూ ఊహించలేరు. కానీ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఏవిధంగా మార్చగలరో చూపించారు.
ఆ రాజకీయ ప్రయోగం బెడిసి కొట్టడంతో ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పగించారు. కనుక అయన మళ్ళీ అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, సీ-పోర్టులు, ఎయిర్ పోర్టులు చకచకా ఏర్పాటు చేస్తున్నారు.
కానీ ఈ అభివృద్ధి పనులు ఇలాగే ఎప్పటికీ సాగుతాయో లేదో తెలీని అయోమయ పరిస్థితి నెలకొంది. కారణం అందరికీ తెలుసు.
కనుక అభివృద్ధి కోసం కేవలం పాలకులు కంకణం కట్టుకుంటే సరిపోదు ప్రజలు కూడా కట్టుకోవాలి. కనుక వేలుకి ఎన్నికల సిరా అంటించుకున్నప్పుడు అది గుర్తుంచుకొని మరీ ఓట్లు వేయాల్సి ఉంటుంది.




