13 జిల్లాలతో కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తన వ్యక్తిగత ఇబ్బందులను బయట పెట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా కాకినాడలో ప్రసంగించిన చంద్రబాబు…
“రాష్ట్ర విభజన కారణంగా ఎక్కువ ఇబ్బంది పడుతోంది నేనే. పాతకేళ్ల క్రితం నా భార్య హైదరాబాద్ లో ఓ కంపెనీని స్థాపించారు. దాని బాధ్యతలను చూసుకునేందుకు ఆమె హైదరాబాదులోనే ఉంటున్నారు. అయితే తానూ మాత్రం విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే ఉంటూ పాలన సాగించడం సరికాదని భావించాను, అందుకే అమరావతికి దగ్గరగా ఉన్న విజయవాడ వచ్చేశాను. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తున్నా, ప్రజల కోసం ఆ మాత్రం చేయలేమా? అనిపించింది. ప్రజల కోసం ఎక్కువ సమయం కుటుంబానికి దూరంగానే గడుపుతున్నాను’’ అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు.
అధికారం చేపట్టి ఏడాదిన్నర్ర కావస్తున్నా… ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు, కష్టాలు తప్ప తన వ్యక్తిగత విషయాలను వివరించని చంద్రబాబు, తొలిసారిగా తన కుటుంబ విషయాలను బహిర్గత పరచడం విశేషం.





