ఇటీవలే ఎన్నికలలోని భారీ పరాజయం నుండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నేతల వలసల భయం ఉన్నా పార్టీ అధినాయకత్వం ప్రజాసమస్యల మీద పోరాటానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారని వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తాము అనుకున్నదాని కంటే ముందే ప్రజావ్యతిరేకత వచ్చిందని, దీనిని వాడుకుని నైరాశ్యంలో ఉన్న శ్రేణులను, నాయకులను సంఘటితం చెయ్యాలని చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇరుకునపెట్టొచ్చని ఆయన అనుకుంటున్నారట. తద్వారా మున్సిపల్ ఎన్నికలు..స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం కూడా చేసినట్టు అవుతుంది. అందుకే తొలి పర్యటన కాకినాడ లో మొదలు పెడుతున్నారు.
వినాయకచవితి తర్వాత సెప్టెంబరు 5, 6 తేదీల్లో ఆయన తూర్పు గోదావరిలో పర్యటిస్తారు. కాకినాడలోనే రెండు రోజులు మకాం వేస్తారు. పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడంతోపాటు ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత వారానికో జిల్లాకు ఆయన పర్యటనకు వెళ్తారు. రెండు రోజులు గడుపుతారు. పార్టీని కింద స్థాయి నుండి పై స్థాయి వరకూ సమూలంగా ప్రక్షాళన చెయ్యాలని చంద్రబాబు యోచిస్తున్నారు.



