“ఆచార్య” ట్రైలర్ ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభమైంది. ఒకప్పుడు రికార్డుల కోసం చిరంజీవి మరియు బాలకృష్ణ అభిమానుల నడుమ ఎంత పోటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సందర్భాలలో మీడియా వర్గాలకు ఇదొక పెద్ద హాట్ టాపిక్ గా కూడా మారింది.
“సమరసింహారెడ్డి, నరసింహనాయుడు” సినిమాలతో బాలయ్య స్థాపించిన ఇండస్ట్రీ రికార్డులను “ఇంద్ర”తో చిరు దాటేయడం, ఆ వెంటనే బాలయ్య “చెన్నకేశవరెడ్డి” సిద్ధం చేయడం, ఇలా ఫ్యాన్స్ కు కావాల్సిన స్టఫ్ తో ‘బాలయ్య Vs చిరు’ ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరంగా ఉండేవి.
కాలక్రమేణా చిరు పొలిటిక్స్ కు వెళ్లడంతో ఈ వార్ కు కొంత విరామం లభించినట్లయింది. ఆ తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కాకపోవడంతో, ఈ హంగామాకు అవకాశం లేకుండా పోయింది. కానీ “ఆచార్య” ట్రైలర్ తో మళ్ళీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది.
గత డిసెంబర్ లో విడుదలైన “అఖండ” సినిమాలోని బాలకృష్ణ నటనను, “ఆచార్య” ట్రైలర్ లోని చిరు యాక్షన్ షాట్స్ ను పోలుస్తూ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ”ఆచార్య” ట్రైలర్ లో మెగాస్టార్ చాలా డల్ గా ఉన్నారని, అదే ”అఖండ”లో బాలయ్య పవర్ ఫుల్ గా నటించారని చెప్తూ ‘సోషల్ వార్’కు తెరలేపారు.
అయితే రెండు నిముషాల ట్రైలర్ లో కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎవరి సత్తా ఏమిటో అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఘాటు సమాధానాలు ఇస్తున్నారు. అలాగే ‘అఖండ’ ముందు బాలయ్య పరిస్థితి ఏంటి? అంతకుముందు సినిమాల జోలికి వెళితే, మీకు మిగిలేది ఏంటో అర్ధం చేసుకోండంటూ హితవు పలుకుతున్నారు.
గతంలో ప్రత్యక్ష వార్ లు ఉంటే, ప్రస్తుతం అవి సోషల్ మీడియాగా మారాయి తప్ప, ఫ్యాన్స్ లో ఏ మార్పు లేదని స్పష్టమవుతోంది. ఏ హీరో అభిమానులు, ఆ హీరోకున్న బలాన్ని చాటుకుంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఒక సినిమాను మరొక సినిమాతో పోల్చడం అనేది అవివేకం.
‘అఖండ’ కధ వేరు, డైరెక్టర్ వేరు, అలాగే రిలీజ్ అయిన సమయం వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అలాగే ‘ఆచార్య’ కూడా! ‘అఖండ’ కధను చిరంజీవి చేయమంటే చేయరు, అలాగే ‘ఆచార్య’ కధను బాలకృష్ణ చేయరు. వాళ్ళ వాళ్ళ బలాలు ఏమిటో వారికి తెలుసుకాబట్టే, ఫ్యాన్స్ కు కావాల్సింది ఇస్తూ, ఈ వయసులో కూడా జనరంజకమైన వినోదాన్ని సిల్వర్ స్క్రీన్ పైన పండిస్తున్నారు.



