ఇక్కడ పెద్దరికం అన్నది ఒక హోదా గానో, ఇంకొకటిగానో అలా అనిపించుకోవడం అన్నది నాకు ససేమీరా ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను, కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినపుడు ‘ఎస్’ నేనున్నానంటూ ముందుకొస్తాను, కానీ అనవసరంగా మాత్రం ప్రతి దానికి నేను తగుదునమ్మా అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదు, ఉండను, ఆ పెద్దవిగా అనుకోనివ్వండి, అది నాకొద్దు.
ఏ సమయంలో అయినా అవసరం వచ్చినపుడు, ఇబ్బందులలో మీకు భుజం కాయాలనుకున్నపుడు ప్రతిసారి నా హృదయం మీ దగ్గరే ఉంటుంది, పరిశ్రమలో మీతో పాటు పెరిగిన వ్యక్తిగా అది నా బాధ్యత కూడా, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. కానీ ఇద్దరు ఎవరో కొట్టుకుంటుంటే వచ్చి తీర్చమని అంటే అలాంటి తగువులు నేను తీర్చను, నాకొద్దు.
ఆరోగ్య సమస్య అయినా, ఉపాధి సమస్య అయినా, ఇంకో సమస్య కానివ్వండి ఖచ్చితంగా నేను ఉంటాను తప్ప, అది కూడా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని, అంతేగానీ రెండు యూనియన్స్ ను దృష్టిలో పెట్టుకునో, ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకునో నన్ను పెద్దరికం, పంచాయితీలు చేయమంటే మాత్రం నేను చేయను. ఆ పెద్దగా నాకొద్దు, మా ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది.
ఇది మెగాస్టార్ నోట నుండి వచ్చిన పలుకులు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిరు చేసిన వ్యాఖ్యలివి. తన సన్నిహితుడు వెంకటేశ్వరరావు ‘ఇండస్ట్రీ పెద్ద’గా ఉండమని విన్నవించుకున్న సందర్భంలో పూర్తి స్పష్టతతో, ఖచ్చితమైన మాటలతో తన భావాలను స్పష్టంగా వ్యక్తపరిచారు మెగాస్టార్.
ఎప్పుడూ మొహమాటం ఎటూ తేల్చకుండా, నర్మగర్భంగా మాట్లాడే మెగాస్టార్ నే చూసాం గానీ, ఇలా అగ్రెసివ్ గా అక్కడిక్కడే ఒక డెసిషన్ తీసుకునే చిరును చూసి చాలాకాలమే అయ్యింది. చెప్పడానికి కూల్ గానే చెప్పినా, చిరు లోలోపల ఆవేదన, ఆక్రోశం ఆయన కళ్ళల్లో కనపడుతూనే ఉన్నాయి. బహుశా రాజకీయ జీవితం నేర్పిన పాఠమో లేక ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ నేర్పిన గుణపాఠమో గానీ, ‘ఇండస్ట్రీ పెద్ద’ టాగ్ కు మెగాస్టార్ తిలోదకాలు ఇచ్చేసారు.
ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న సమస్యలలో ఏపీలోని టికెట్ ధరల అంశం అత్యంత ప్రధానమైనది. ఒకవేళ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తే, అందరి కంటే ముందు తానే ఉండి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి. కానీ జగన్ సర్కార్ చిరు మాటలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాట్లాడడం లేదు. అలాగే ఇప్పటివరకు జగన్ తన అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. చిన్న చిన్న విషయాలలో కూడా రాజకీయం రాజ్యమేలడం పట్ల చిరు బాగా విసిగిపోయారని అయితే స్పష్టంగా అర్ధమవుతోంది.



