చిరంజీవి ఎఫెక్ట్! కాంగ్రెస్ కు మంచి రోజులు?

chiranjeevi effect to congresమెగాస్టార్ చిరంజీవి సొంతంగా ఏర్పాటు చేసుకున్న “ప్రజారాజ్యం” పార్టీకి ప్రజలు అడ్రస్ గల్లంతయ్యే తీర్పు ఇవ్వడంతో, అది కాస్తా… కాంగ్రెస్ అనే మహాసముద్రంలో కలిసిపోయింది. మెగాస్టార్ అలా కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారో లేదో ఆ మహాసముద్రాన్ని కూడా ప్రజలు ఎండ కట్టేసారు. ఈ రెండు పార్టీలు ఇలా మారడానికి కారణం… మెగాస్టార్ చిరు గారి పుణ్యమేనని రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరిగింది.

ఒక్క పొలిటికల్ వర్గాలే కాదు, ప్రజల నోళ్ళల్లో కూడా ఈ రకమైన ప్రచారం ఊపందుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మెగాస్టార్ అభిమాన గణంతో సహా అందరూ “చిరు ఎఫెక్ట్”ను విశ్వసించడం ప్రారంభించారు. అయితే అటు కాంగ్రెస్ కు, ఇటు చిరంజీవికి దిక్కులేకపోవడంతో పరిస్థితి ‘గంతకు తగ్గ బొంత’ మాదిరి తయారయ్యింది.

ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. దీంతో త్వరలో చిరు కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినపడ్డాయి. దీనిపై ఎవరూ స్పందిచకపోవడంతో ఒట్టి పుకార్లేనని భావించారు. కానీ చిరు సోదరుడు పవన్ ద్వారా మెగాస్టార్ మరో “మెగా” స్టెప్ కు బ్యాక్ గ్రౌండ్ రెడీ అవుతోందన్న సంకేతాలు ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇప్పటికే రెండు పార్టీల ‘భరతం’ పట్టిన మెగాస్టార్ త్వరలో బిజెపి అంతు చూసే అవకాశం కూడా కనపడుతోందని సోషల్ మీడియా వేదికగా ఛలోక్తులు విసురుతున్నారు. బహుశా చిరు బిజెపిలోకి వెళ్ళబోతున్నారన్న సంకేతాలే మోడీ పై ప్రజల వ్యతిరేకత అన్న కౌంటర్లు కూడా పడుతున్నాయి. అలాగే చిరు వీడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ వెలిగిపోవచ్చు అన్న చర్చ కూడా మొదలైంది.

ఒకవేళ ప్రస్తుతం వినపడుతున్న వార్తలే నిజమై మెగాస్టార్ బిజెపిలోకి ఎంట్రీ ఇస్తే, చిరు రాజకీయ భవిష్యత్తు ఏమో గానీ, ‘మెగా బ్రదర్’ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారే అవకాశం స్పష్టమన్న అభిప్రాయాలూ విశ్లేషకుల నుండి వస్తున్నాయి. అంటే బిజెపిలోకి చిరు ఎంట్రీ వలన “ఒక్క దెబ్బకు రెండు పిట్టలు గల్లంతన్న” మాట!

ADVERTISEMENT
Latest Stories