మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్స్ ను సాధించిన మాట ఎంత వాస్తవమో, విమర్శకుల, ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టలేదన్న మాట కూడా అంతే వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే నిస్పక్షపాతంగా మాట్లాడే మెగా అభిమానులు సైతం చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు. కేవలం డ్యాన్స్ లు, ఫైట్లు కోసం తీసిన సినిమా మాదిరి ఉంది గానీ, మెగాస్టార్ 150వ సినిమా స్థాయికి తగిన సినిమా కాదని విమర్శిస్తున్నారు.
మరో వైపు చారిత్రాత్మక కధతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించలేదేమో గానీ, ‘100వ సినిమా అంటే ఇలాగే ఉండాలి’ అని సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించే విధంగా ఉందన్న టాక్ ను తెచ్చుకుంది. కొన్ని కొన్ని సన్నివేశాలలో బాలయ్య మేకప్ కాస్త సరితూగనప్పటికీ, ఈ సినిమాను చేయాలంటే ఒక్క బాలకృష్ణ తప్ప మరొకరు లేరు అన్న అద్భుతమైన స్పందనను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది.
ఇదే విశ్లేషణలను ఆధారంగా తీసుకుని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సెటైర్ తో సోషల్ మీడియా ముందుకు వచ్చేసారు. ‘అరువు’ కధతో ఓ తెలుగు సినిమా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో 2000 సంవత్సరాల నిజమైన కధతో తెలుగు సినిమాను మరో 10 ఏళ్ళు ముందుకు తీసుకువెళ్లిందని ట్విట్టర్ వేదికగా మరోసారి మెగా మూవీని టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేసారు. వర్మ మాటలు కాస్త కటువుగా ఉంటాయి గానీ, అందులో నిజం లేకపోలేదు అంటూ మద్దతు పలుకుతున్నారు నెటిజన్లు.



