కమర్షియల్ సినిమాల స్థాయిని విజయాలను కేవలం వసూళ్లను బట్టి లెక్కకడితే తప్పని బాక్సాఫీస్ పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేదే అసలైన సక్సెసని ఒప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తుతోంది. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కాదని ఎవరూ అనలేరు. కలెక్షన్లు అంత భారీగా వచ్చాయి. అపోజిషన్ వీరసింహారెడ్డిలో సెంటిమెంట్ డోస్ కొంత ఎక్కువ కావడంతో పండగ సీజన్ లో ఎంటర్ టైన్మెంట్ ఇష్టపడే పబ్లిక్ సహజంగానే మెగా మూవీ వైపు కాస్త ఎక్కువ మొగ్గు చూపారు. చాలా చోట్ల రికార్డులు కూడా వచ్చాయి. అలా అని బాలయ్య సైలెంట్ గా ఉన్నాడు. కెరీర్ హయ్యెస్ట్ నమోదు చేశాడు.
కట్ చేస్తే రెండు రోజుల క్రితం వాల్తేరు వీరయ్య ఓటిటిలో వచ్చింది. యాభై కోట్లు పెట్టి కొన్న నెట్ ఫ్లిక్స్ పెద్ద హడావిడి చేయకుండా సైలెంట్ గా అది కూడా డ్రై రోజుగా భావించే సోమవారం స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ప్రత్యేకంగా ట్రైలర్ కట్ కూడా చేయించలేదు. ప్రొడక్షన్ హౌస్ దే వాడుకుని దాని మీద లోగో వేశారు. తీరా చూస్తే సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్యకు సంబంధించిన సంగతులు పెద్దగా కనిపించడం లేదు. థియేటర్లో మిస్ అయినవాళ్లు చిన్నితెరపై చూశాకా ఆహా ఓహో అంటూ మెచ్చుకున్న దాఖలాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఫ్యాన్స్ హడావిడే కొంత ఉంది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఏదో కాలం కలిసొచ్చో లేక ఇతర కారణాల వల్లో కమర్షియల్ గా లాభాలు తెచ్చిన సినిమాలన్నీ లాంగ్ రన్ లో ఎవర్ గ్రీన్ గా నిలవవు. ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ ఇప్పటికీ అభిమానుల్లో అదే వైబ్స్ తెస్తోంది. మరి వాల్తేరు వీరయ్య ఓ అయిదు పదేళ్ల తరువాత అంత యుఫోరియా సృష్టిస్తుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మూడు వందల కోట్లు వసూలు చేసిన వారసుడు నెటిజెన్ల చేతిలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయింది. తెగింపుని కూడా ఇదేం తలనెప్పి బ్యాంకు రాబరీ అని తిట్టుకున్నా తెలుగు జనాలు బోలెడున్నారు.
శాటిలైట్ ఛానల్స్ లో వచ్చాకైనా వీటి పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండకపోవచ్చు. ట్రెండ్ మారిందని కొందరు అనొచ్చు. ఆస్కార్ సందడి మొదలుకాక ముందే ఆర్ఆర్ఆర్ ఓటిటిలో రిలీజైనప్పుడు కొన్ని వేల లక్షల అభినందన ట్వీట్లు వచ్చాయి. అవి చూసే కొన్ని దేశాల్లో మళ్ళీ థియేట్రికల్ రీరిలీజ్ చేస్తే టికెట్లు దొరకలేదు. మళ్ళీ మూడో సారి చేస్తున్నా అదే స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా ఉండొచ్చు. వచ్చి రెండు రోజులే దాటింది కాబట్టి అదేమీ వింత కాదు. ఎప్పుడో ఏడాది క్రితం వచ్చిన గంగూబాయ్ కటియావాడి ఇప్పటికీ ఇదే ప్లాట్ ఫార్మ్ టాప్ 10లో చోటు కొనసాగిస్తోంది. మనవీ అలా చేసినప్పుడు ఆల్ టైం క్లాసిక్ ని ట్యాగ్ ఇచ్చేయొచ్చు.



