అప్పుడప్పుడు సొంత పార్టీపై, సొంత పార్టీ నాయకులపై తనదైన రీతితో విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించే మాజీ మంత్రి శంకరరావు మరోసారి పార్టీ నాయకులపై విమర్శలు చేసి చర్చనీయాంశం అయ్యాడు. తాజాగా జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. ఆ ఫలితానికి కారణం పార్టీ నాయకులే అని శంకరరావు అంటున్నాడు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిన అభ్యర్థిని వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు అని విమర్శలు గుప్పించాడు.
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోలేదు అని, పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఓడి పోయాడు అన్నాడు. సర్వే స్థానికుడు కాకపోవడంతో పాటు, సర్వేపై ఏ ఒక్కరికి సరైన నమ్మకం లేదు అని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా సర్వేపై నమ్మకం ఏర్పడలేదు అని, అందుకే సర్వే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయాడు అని శంకరరావు అన్నాడు. డిపాజిట్ కూడా రాని అభ్యర్థిని పోటీలో నిలిపి రాష్ట్ర నాయకత్వం తప్పు చేసిందని, ఈ ఓటమిని పార్టీకి రుద్దడం భావ్యం కాదని శంకరరావు పేర్కొన్నాడు. కొందరు కాంగ్రెస్ నాయకులు శంకరరావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.





