‘మనం’ దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ’24’ సినిమా విడుదలై విమర్శకుల అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రయోగాత్మక సినిమాలను వీక్షించే ప్రేక్షకుల మన్ననలను కూడా పొందిన ‘24’ సినిమాలో సూర్య – సమంతల లవ్ ఎపిసోడ్ ప్రధాన ‘మైనస్’ పాయింట్ గా మారింది. ఈ ప్రభావం రన్ టైం మీద కూడా పడడంతో… ఆడియన్స్ మెప్పు పొందినప్పటికీ, కొంత అసంతృప్తి వ్యక్తమయ్యింది.
దీంతో ‘24’ సినిమాలోని ‘ట్రిమ్మింగ్’కు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. దాదాపు 7 నిముషాల నిడివి గల సన్నివేశాలు కోతకు గురి కానున్నాయి. ఫస్టాఫ్ లో 3 నిముషాలు, సెకండాఫ్ లో 4 నిముషాల పాటు కత్తెరకు గురి కాబోతున్న ఈ విషయం సూర్య అభిమానులకు కాస్త నిరాశజనకంగానే ఉన్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఎడిటింగ్ ‘24’ సినిమాకు అవసరమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాపై ముక్తకంఠంతో ఎన్ని ప్రశంసలు అయితే కురిపించారో, అంతే విధిగా రన్ టైం మరియు లవ్ ఎపిసోడ్ల గురించి విమర్శించారు.
ఎడిటింగ్ తర్వాత ‘24’ సినిమా రన్ టైం విషయంలో ప్రేక్షకులు పూర్తి సంతృప్తి చెందవచ్చని ఇప్పటికే సినిమాను వీక్షించిన వారు చెప్తున్న సంగతులు. ఈ సినిమా విడుదల టాలీవుడ్, కోలీవుడ్ లలో దర్శకుడిగా విక్రమ్ కు మరింత క్రేజ్ ఏర్పడగా, నటుడిగా ఆత్రేయ పాత్రలో సూర్య ప్రశంసలు అందుకుంటున్నాడు. సున్నితమైన స్క్రిప్ట్ లను తనదైన స్క్రీన్ ప్లేతో కట్టిపడేయడం విక్రమ్ స్పెషాలిటిగా మారింది.



