టీఆర్ఎస్ లో ‘దానం’ చేరకపోవడానికి ‘కారణం’

danam nagender joining trsతెలంగాణా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు నుండి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జంప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు రాజకీయ వర్గాలో హల్చల్ చేసింది. వాస్తవానికి డిసెంబర్ 7వ తేదీన దానం టీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికి రెడీ అయ్యారన్న వార్తలు బలంగా వినిపించాయి. దీంతో హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండాతో కూడిన ఫ్లెక్సీలు భారీ ఎత్తున వెలిసాయి. అయితే రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలను దానంకు సంబంధించిన అనుచరులే తొలగించివేసారు. మరో వైపు దానం కూడా తాను టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ ప్రకటించారు.

ఉన్నట్లుండి దానం ఎందుకు ఇలా ట్విస్ట్ ఇచ్చారని… రాజకీయ, మీడియా వర్గాలు తీవ్ర ఆసక్తిని ప్రదర్శించాయి. తెలంగాణా గట్టు మీద వినపడుతున్న సమాచారం మేరకు… దానం టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమై, పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ‘గులాబీ’ కండువా కప్పుకోవాలని భావించారట. అయితే కేసీఆర్ మాత్రం మాజీ కాంగ్రెస్ నేత అయినటువంటి కె.కేశవరావు సమక్షంలో చేరాలని సూచించడంతో దానం కాస్త అసహనం వ్యక్తం చేసారట. తన వంటి సీనియర్ నేత పార్టీలోకి వస్తుంటే, తగిన విధంగా ప్రాధాన్యత దక్కట్లేదని, గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు పార్టీలోకి చేరిన సమయంలో స్వయంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించగా, తన విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి సమక్షంలో చేరమనడం వల్లనే దానం చేరిక అర్ధాంతరంగా క్యాన్సిల్ అయ్యిందని రాజకీయ, మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories