సినిమాలలో నటించాలనే కలగనేవారు ఉన్నట్లే, రాజకీయాలలో ఉన్నవారు కూడా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కలలు కంటుంటారు. అలాంటి రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు పెంచుతుంది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ‘డీలిమిటేషన్ బిల్.’
ఈ నెల 30, డిసెంబర్ 1న లోక్‌సభ, డిసెంబర్ 2,3 తేదీలలో రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలిపారు. డీలిమిటేషన్‌లో అన్ని రాష్ట్రాలకు 50% శాతం చొప్పున సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసి చట్టరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని అప్పుడే లెక్కలు వేసుకుంటూ సంతోషపడుతున్నారు రాజకీయ నిరుద్యోగులు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లు 263కి పెరుగుతాయి. అదేవిధంగా ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే నిష్పత్తిలో మంత్రి పదవులు కూడా 26 నుంచి 39కి పెరుగుతాయి.
అంటే అదనంగా మరో 88 మందికి ఎమ్మెల్యేలుగా, మరో 13 మందికి మంత్రులుగా, మరో 13మందికి ఎంపీలుగా అవకాశం లభిస్తుందన్న మాట!
ఈ డీలిమిటేషన్ బిల్లు ఆమలులోకి వస్తే ఇదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి.
కనుక దేశంలోని రాజకీయ నిరుద్యోగుల పాలిట ఈ డీలిమిటేషన్ ఒక ‘గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్’వంటిదేనని చెప్పవచ్చు.
ఈ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు ఈ సంఖ్యలు కొద్దిగా మారితే మారవచ్చు కానీ పెరగడం మాత్రం ఖాయం.





