డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్: పార్టీల కోసమా.. ప్రజల కోసమా?

Delimitation and women's reservation bills debate

చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలలో లోకంలో అన్నీ సవ్యంగానే ఉన్నట్లనిపిస్తుంది. కానీ బయట లోకం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నేటికీ ఆ పుస్తకాలు, కొద్దిపాటి మార్పులతో వాటిలో పాఠాలు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు లోకం ఇంకా భయానకంగా మారింది. వాటిలో నేర్పిన పాఠాల ప్రభావం కనీసం పాఠశాల గేటు వరకు కూడా ఉండటం లేదు.

ఉదాహరణకు డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లులకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినిపిస్తున్న వాదనల గురించి చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

ఈ రెండు బిల్లులు ముడిపెట్టడం ఒక తప్పు. ముందుగా జనాభా లెక్కలు పూర్తిచేసి వాటి ఆధారంగా మహిళలకు రిజర్వేషన్స్ కేటాయించకుండా 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించాలనుకోవడం మరో తప్పని కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి. వీటిని వ్యతిరేకిస్తున్నాయి.

డీలిమిటేషన్‌పై మరో ముఖ్య వాదన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేయడం చాలా దుర్మార్గం.

సామాన్య ప్రజల అభిప్రాయం మరోలా ఉంది. ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలే దేశాన్ని, రాష్ట్రాలను పట్టించుకోకుండా పదవులు, అధికారం, కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటూ వందల, వేల కోట్లు పోగేసుకుంటున్నారు. కనుక ఈ డీలిమిటేషన్‌ ద్వారా మరింత మంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ ఆదాయం సమకూరుతుంది తప్ప దేశానికి కొత్తగా ఒరిగే దేముంది? వారి జీతభత్యాలు, భద్రత, పర్యటనలు, వాటి ఖర్చుల భారం కూడా సామాన్య ప్రజలే మోయాలి కదా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

దేశ జనాభా 140 కోట్లు దాటిపోయినందున డీలిమిటేషన్‌ ద్వారా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పాలన వికేంద్రీకరణ జరిగి దాంతో అభివృద్ధి వేగవంతం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సీట్లు 50 శాతం పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ బిల్లులను ఇండీ కూటమి వ్యతిరేకిస్తోంది. కనుక వాటి మద్దతు అవసరం లేకుండా ఈ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. డీఎంకే, ఎన్సీపీ, బీజేడి తదితర పార్టీల మద్దతుతో ఈ రెండు బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాటిలో ఎన్సీపీ ప్రతిఫలంగా మహారాష్ట్ర బిజేపి ప్రభుత్వంలో రెండు కీలక మంత్రి పదవులు అడుగుతున్నట్లు సమాచారం. మిగిలిన పార్టీలు కూడా ప్రతిఫలం ఆశించకుండా మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక వాటికీ తగిన ప్రతిఫలం ఏదో రూపంలో ముట్టవచ్చు.

అంటే ఈ బిల్లులు, రాజకీయ పార్టీలు, వాటి రాజకీయ నిరుద్యోగుల కోసమా లేక ప్రజల కోసమా? అనే సందేహం కలగడం తప్పు కాదు కదా?

ఈ వాదనలు, వ్యూహాలను చూస్తున్నప్పుడు చిన్నప్పటి పాఠ్య పుస్తకాల సంగతి దేవుడెరుగు కనీసం డిగ్రీ, పీజీ స్థాయి పాఠ్య పుస్తకాలలో చెప్పుకున్నవిధంగా కూడా మన దేశ రాజకీయాలు లేవని స్పష్టమవుతోంది… కదా?

ADVERTISEMENT
Latest Stories