విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన “96” సినిమా అక్టోబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరించడంతో, ఈ బొమ్మపై కోలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న టాక్ హల్చల్ చేసింది.
[m9ad]
అంతేకాక ఈ సినిమాలో నాని – సమంత జంటగా నటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ట్విట్టర్ లో స్పందించిన దిల్ రాజు, నిర్మాణ సంస్థ ద్వారా ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. “96 సినిమా రీమేక్ హక్కులను తీసుకున్న మాట వాస్తవమే, కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మిగతా విషయాలన్నీ ఒట్టి పుకార్లేనని” స్పష్టం చేసారు.
“సరైన సమయం చూసుకుని ఈ సినిమా కాస్టింగ్ మరియు ఇతర ఎంపికలపై తామే అధికారికంగా ప్రకటిస్తామని” తెలిపారు. దీంతో ఈ సినిమా రీమేక్ లో నాని – సమంతలు కలిసి నటిస్తున్నారన్న అంశం పుకారుగా తేలింది. అయితే ఇది నిజమయ్యే అవకాశాలు లేకపోలేదన్నది టాలీవుడ్ టాక్. గతంలో వీరిద్దరి కలయికలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.



