“నాన్నకు ప్రేమతో” సినిమా ఇంటర్వెల్ సీన్ లో హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన తెలివి తక్కువ వాడు, తెలివైన వాడు, అతి తెలివైన వాడు డైలాగ్స్ సగటు సినీ ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో అర్ధం కావాలంటే ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూడాల్సిందే. కానీ ఆ డైలాగ్స్ ను సుకుమార్ ఎన్ని రోజుల్లో రాసారు? ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసారు? అని అంచనా వేసుకుంటే తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే కేవలం రెండు నుండి మూడు నిమిషాల్లో ఆ డైలాగ్స్ అన్నీ సుకుమార్ పూర్తి చేసారు. ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే చెప్పారు. అది సుక్కూ ఎంతటి ‘జీనియస్’ అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
ఒక దర్శకుడిగా నెక్స్ట్ జనరేషన్ ఆలోచనలు చేసే అలాంటి సుకుమార్ జీవితం ఎలా ఉంటుంది? మహేష్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఒక స్థాయి దర్శకుడిగా నిరూపించుకున్న సుకుమార్ లైఫ్ స్టైల్ తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. ఒక బ్యాచిలర్ రూమ్ మాదిరి సుకుమార్ ఆఫీస్ రూమ్ దర్శనమివ్వడం విశేషం. ఓ ప్రముఖ వెబ్ మీడియా అధినేతకు సుకుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా చూపించిన ఆఫీస్ రూమ్, అమీర్ పేట్, కూకట్ పల్లిలోని రొటీన్ బ్యాచిలర్ల రూమ్ ల కంటే దారుణంగా ఉండడం విశేషం.
చింపిరి చింపిరిగా పడేసిన పుస్తకాల నడుమ, చాపలు, దిండ్లు, వాటర్ బాటిల్స్ మధ్య సుకుమార్ స్క్రిప్ట్ ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తుంటారని తేలింది. ఇంటికి కూడా వెళ్ళకుండా ఆఫీస్ రూమ్ లోనే స్క్రిప్ట్ లు, సన్నివేశాలు గురించి ఆలోచిస్తూ సమయం గడిపేయడం సుకుమార్ జీవితంలో సర్వసాధారణం. తానూ పుస్తకాలు మాత్రమే చదువుతానని, అందుకే చెప్పడం కన్నా, తనకు ఏం కావాలో అన్న విషయాన్ని తన భార్య స్లిప్ ల రూపంలో రాసి ఇస్తుందని చెప్పిన ఉదంతం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో సీన్ ను గుర్తుకు తేవడం సహజమే!





