కమర్షియల్ సినిమా VS క్లాస్ సినిమా – ఏది గొప్ప

Director Venkatesh Mahaకెజిఎఫ్ మీద దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్లతో సోషల్ మీడియాలో చిన్న సైజు తుఫాను రేగింది. ఒక స్టార్ డైరెక్టర్ ఈ మాటలు అనుంటే ఇంత ప్రాధాన్యం దక్కేది కాదేమో కానీ కేవలం రెండు సినిమాల అనుభవమున్న ఓ యువకుడు అవసరానికి మించిన అత్యుత్సాహంతో ప్రవర్తించడం ఈ స్థాయి నెగటివిటీకి కారణమయ్యింది. ఇదే కమర్షియల్ లేదా మాస్ సినిమాకు క్లాస్ మూవీకి ఎవరు గొప్పనే ప్రశ్నను లేవనెత్తుతోంది. సమాధానం దొరుకుంతుందేమో చూద్దాం. మొన్న ఏడాది పుష్ప పార్ట్ 1 ది రైజ్ వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అంటే అదేదో డిడిఎల్ లా క్లాసిక్ అని కాదు. పక్కా మసాలా మెటీరియలని.

ఇది వచ్చిన నెలల వ్యవధిలో సీతారామం రిలీజయ్యింది. ఎలాంటి హంగులు లేకపోయినా నిజాయితీ ప్రేమకథకు పట్టం దక్కింది. విజయనగరం అనే పట్టణంలో కోటి రూపాయల గ్రాస్ రావడమే దీనికి ఉదాహరణ. పుష్ప, సీతారామంలు పూర్తి విరుద్ధమైన నేపధ్యాలు కలిగినవి. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను నెత్తినబెట్టుకున్న జనమే ఇప్పుడు బలగం కోసం థియేటర్లకు వస్తున్నారు. రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా. లేదే. జానర్లు వేరు క్యాస్టింగ్లు వేరు ఆఖరికి టార్గెట్ ప్రేక్షకులు వేరు. అయినా హిట్లు కొట్టాయిగా. సో టాలీవుడ్ లో కేవలం మసాలా కంటెంట్ కే పట్టం కడతారనే వాదన శుద్ధతప్పు. ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి.

ADVERTISEMENT

ఇంకా డిటైల్డ్ గా అర్థం కావాలంటే పెళ్లి చూపులు కన్నా అర్జున్ రెడ్డికే కలెక్షన్లు చాలా ఎక్కువగా వచ్చాయి. విజయ్ దేవరకొండ ఈ లెక్కని తప్పుగా అర్థం చేసుకుని నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ లాంటివి డిజాస్టర్ అయితే అసలే అంచనాలు లేకుండా తీసిన గీత గోవిందం రికార్డులు తెచ్చి పెట్టింది. ముప్పై ఏళ్ళ క్రితం చిరంజీవి బాలకృష్ణలు మాస్ పాలిట కామధేనువులుగా మారినప్పుడు వాళ్ళ హావాలోనే కె విశ్వనాథ్ గారు స్వాతిముత్యం, సాగర సంగమం లాంటి క్లాసిక్స్ ఇచ్చారు. ఎన్నో సెంటర్లలో ఇవి వంద రోజులు పండగ చేసుకున్నాయి. ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో రామోజీరావు గారు ప్రతిఘటన నిర్మిస్తే దానికొచ్చిన వసూళ్లు అప్పట్లో ఎందరికో నిద్రను దూరం చేసాయి.

దీన్ని బట్టి కాలం జెనరేషన్ తో సంబంధం లేకుండా వేటికి ఆదరణ దక్కుతుందో అర్థమవుతోంది. అంతే తప్ప సెన్సిబుల్ సినిమాలు చూడటం లేదని ఎవరినీ నిందించి లాభం లేదు. బాక్సాఫీస్ లెక్కల్లో నిర్మాత లాభపడుతున్నాడా లేదా అనేది ముఖ్యం కానీ విలువలు వలువలు అంటూ నువ్వెంత గొప్ప చిత్రం అందించావన్నది అనవసరం. ఆ మాటకొస్తే మరి బలగంకు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో కూడా హౌస్ ఫుల్స్ ఎలా పడ్డాయి. థియేటర్ల మనుగడకు కమర్షియల్ సినిమాలు ఇచ్చినంత ఆక్సీజన్ క్లాస్ మూవీస్ ఇవ్వవనేది వాస్తవం. బిర్యానీ అమ్ముడుపోయినంతగా దద్దోజనం ఎందుకు పోవడం లేదని శాఖాహారులు ధర్నాకు దిగితే అంతకన్నా కామెడీ మరొకటి ఉంటుందా. ఈ చర్చ కూడా అలాంటిదే.

ADVERTISEMENT
Latest Stories