ఎన్నికల రూపం మారుతుందా.?

Free Schemes Politics

సార్వత్రిక ఎన్నికల మొదలు స్థానిక సంస్థల ఎన్నికల వరకు రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు ప్రజలకు ఇస్తున్న ఉచిత హామీలు బడ్జెట్ దాటిపోతున్నాయి. ఒకప్పుడు రాష్ట్ర ఖజానాకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన ఉండేది,

కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఖజానా ఖాళీ అయినా, రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయం కంటే అప్పులే ఎక్కువున్నా ఎవరు తగ్గేదెలా అనేలా ఉచితాలతో రెచ్చిపోతున్నారు. ఓటర్లను తమ పార్టీ వైపు ఆక్షరించే ప్రయత్నంలో ఎన్నికల ముందు ఓటుకి నోటు తో పాటు ఎన్నికల తరువాత ఉచితాల పంపకాలు కూడా జోడిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే సంక్షేమం పేరుతో పార్టీలు ప్రభుత్వాలుగా మారడానికి ఎంచుకుంటున్న ఈ ఉచితాలకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదభావాలేమి లేవు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మొదలు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, బిఆర్ఎస్, డీఎంకే, ఎఐడీఎంకే….ఇలా అన్ని పార్టీలు కూడా పథకాల పేర్లు వేరయినా నడిచే దారి ఒక్కటే అన్నట్టుగా తయారయ్యాయి.

ఒకరిది నవరత్నాలైతే, మరొకరిది సూపర్ సిక్స్, ఒకరిది ఆరు గ్యారెంటీలైతే మరొకరిది షూరిటీ….ఇలా పేర్లు ఏదైనా ఉచితాలు కామనే. అయితే వీటిలో కూడా ఏదైనా పథకం ప్రజల దృష్టిని ఆకర్షించింది అంటే ఆ పథకం రాష్ట్ర సరిహద్దులు దాటాల్సిందే అనేలా పార్టీలు పోటీపడి మరి ఆ పథకాలను తమ ఎన్నికల హామీలుగా మారుస్తున్నాయి.

ఇప్పుడు అటువంటిదే ఒకటి…కర్ణాటక కాంగ్రెస్ లో మొదలైన మహిళలకు ఫ్రీ బస్ పథకం, అలా తెలంగాణ వరకు ప్రయాణించి అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది, ఇక అక్కడి నుండి ఏపీలోకి ఎంటర్ అయిన ఈ ఉచిత బస్ ప్రయాణం కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది.

దీనితో ఇప్పుడు ఈ పథకం జెండర్ మార్చుకుని తమిళనాట అడుగుపెట్టబోతుంది. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏఐడీఎంకే తన తొలి విడత మానిఫెస్టో ని విడుదల చేసింది. ఇందులో ఇన్నాళ్లుగా పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇప్పుడు తమిళనాట పురుషులకు వర్తింపచేస్తాం అంటూ AIDMK పార్టీ నేతలు ప్రకటించారు.

అలాగే తమ తొలి విడత ఉచిత పథకాల పంపిణీ ప్రక్రియలో భాగంగా…రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు నెలకు 2 వేలు ఆర్థిక సాయం, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద 25 వేల సబ్సిడీ, ఇళ్లు లేని వారికీ ఉచిత ఇళ్ళు, సిటీ బస్సులలో పురుషులకు ఉచిత ప్రయాణం, ఉపాధి హామీ పని దినాలు 150 కి పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది AIDMK.

అధికారం కోసం ఆశ పడే ప్రతిపక్ష AIDMK పార్టీ అదీ మొదటి దఫాలోనే ఈ స్థాయిలో ఉచితాలను ప్రకటిస్తే ఇక ఉన్న అధికారాన్ని చేజారిపోకుండా చూసుకోవడానికి అధికార డీఎంకే ఉచితాలు ఏ స్థాయి వరకు వెళుతాయో? అలాగే కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే ప్రజల మనసు గెలవాలని ఆశపడుతున్న దళపతి విజయ్ TVK మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో.?

ఇలా ఎవరికీ వారు వారి రాజకీయ స్వలాభం కోసం ఇలా ఉచితాలు ప్రకటించుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, తద్వారా దేశ ఆర్థిక ప్రగతిని దెబ్బతీస్తూ, అప్పులు కుప్పగా మారుస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు ఇలా ఎన్నికలు అనే ఒక రాజ్యాంగ ప్రక్రియను అంగడిలో సరుకు మాదిరి మార్చేస్తున్నారు..!

దీని ద్వారా లబ్ది దారులు, రాజకీయ పార్టీలు తాత్కాలిక ప్రయోజనాలను పొందవచ్చు కానీ ఈ ఉచితాలు ఏదోనాడు భారతదేశ భవిష్యత్ ని ఒక వైరస్ మహమ్మారిలా పట్టిపీడించక మానదు.

ADVERTISEMENT
Latest Stories