ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో సఫారీలకు చుక్కలు చూపించింది ఆతిధ్య జట్టు. దీంతో నాలుగవ రోజునే విజయాన్ని అందుకున్ని సిరీస్ లో 1-0తో లీడ్ లో నిలిచింది ఇంగ్లాండ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 458 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒకానొక దశలో 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను కెప్టెన్ రూట్ 190 పరుగులు చేసి ఆదుకున్నాడు. అలాగే బెన్ స్టోక్స్ 56, అలీ 87, బ్రాడ్ 57 పరుగులతో తమ వంతు కృషి చేసారు.
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 361 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఎల్గర్ 54, బృయ్న్ 48, బావుమా 59, డీకాక్ 51, ఫిలండర్ 52 పరుగులతో ఆదుకున్నారు. లీడ్ తో రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుక్ 69, బైర్ స్టౌ 51 పరుగులతో రాణించారు. దీంతో 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు కేవలం 119 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. స్పిన్నర్ మొయిన్ అలీ 53 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీయడంతో మ్యాచ్ 36.4 ఓవర్లలోనే ముగిసింది.
సొంత గడ్డపై మంచి ఫాం కనపరుస్తున్న ఇంగ్లాండ్ జట్టు, అదే ఊపులో సఫారీలను మట్టి కరిపించడం విశేషం. మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లతో పాటు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 87 పరుగులు చేసిన మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక కెప్టెన్ గా తొలి మ్యాచ్ లో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ గా రూట్ రికార్డులకెక్కాడు. కెప్టెన్ గా తొలి ఇన్నింగ్స్ లోనే (190 పరుగులు) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని త్రుటిలో జారవిడుచుకున్నాడు రూట్.



