ఇప్పటి యువతరం, ముందుతరం వారి జీవనశైలితో పోల్చి చూసినప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. ఎంతగా అంటే భారతీయులు, అమెరికన్ల జీవనశైలిలో ఉన్నంత తేడా అనుకోవచ్చు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ నూరు శాతం వాస్తవమే… అని అందరికీ తెలుసు.
అయితే కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణి, సాంకేతిక మార్పులు, ఉద్యోగాలు, ఉపాధి, పని తీరు, ఆదాయం, ఖర్చులు, ఆహారం అన్నీ మారుతూనే ఉంటాయి. కనుక తరాల మద్య జీవనశైలిలో ఈ మార్పులు కూడా చాలా సహజమే.
కనుక ఒకరివి మరొకరికి నచ్చకపోవచ్చు. తప్పుగా అనిపించవచ్చు. కానీ కాల ప్రవాహంలో ఈ మార్పులని ఎవరూ ఆపలేరు. కనుక ఈ మార్పులు ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవలసిందే.
అయితే ముందు తరం వారు చేసిన శారీరిక శ్రమ ఇప్పటి యువతరానికి ఉండటం లేదనే చెప్పాలి. ఎక్కువ సమయం కుర్చీలలో కంప్యూటర్ ముందు కూర్చోవడం తప్పడం లేదు.
వారానికి రెండు రోజులు సెలవు పేరుకే కానీ ఆ రెండు రోజుల పని ప్రతీరోజూ అర్ధరాత్రి వరకు చేసే పనితో సరిపోతుంది. అధిక పని గంటలు, పని ఒత్తిడి, ఉద్యోగ అభద్రత వంటి అనేక సమస్యలు నేటి యువతరం ఎదుర్కొంటోంది.
కానీ ఈ కష్టానికి ప్రతిఫలంగా 30-35 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఇల్లు, కారు, విలాసవంతమైన జీవితం సంపాదించుకో గలుగుతున్నారు. కానీ ముందు తరం వారు 50-60 ఏళ్ళు కష్టపడితే కానీ ఇవన్నీ సమకూర్చుకోలేకపోయేవారు. కనుక నేటి తరం ఖచ్చితంగా ముందుతరం కంటే చాలా వేగంగా పైకి ఎదుగుతోందని చెప్పవచ్చు.
కానీ ఈ ఎదుగుదలకు వారు చాలా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. 30-35 ఏళ్ళు వచ్చేసరికి బోనస్‌గా బీపీ, షుగర్, ధైరాయిడ్, అధిక బరువు, కళ్ళ సమస్యలు, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.
జీవితం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే యువత చాలా క్రమశిక్షణతో ఆహారం విషయంలో నోరు అదుపు చేసుకొంటోంది, ఇది చాలా అభినందించాల్సిన విషయమే.
ముందు తరంలో ఇంతగా ఆహారంపై నియంత్రణ ఉండేది కాదు. కానీ అప్పుడు ప్రతీ ఒక్కరూ శారీరిక శ్రమ చేసేవారు. చేయక తప్పేది కాదు. అలాగే ఇప్పుడు ఉన్నంతగా ఇన్ని ఒత్తిళ్ళు అప్పుడు ఉండేవి కావు, కనుక 65-75 ఏళ్ళు వచ్చినా నేటికీ కాస్త ఆరోగ్యంగానే ఉండగలుగుతున్నారు.
నేటి యువతరంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల స్పృహ బాగానే ఉంది. కనుక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకోనివారు… తీసుకోలేని స్థితిలో ఉన్నవారు ముందే చెప్పుకున్నట్లు డబ్బు, ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలన్స్‌తో పాటు రోగాలు కూడా సంపాదించుకుంటున్నారు.
రెండు తరాల మద్య ఇన్ని అంతరాలు చూస్తున్నప్పుడు, తర్వాత తరం జీవనశైలి ఏ విధంగా ఉండబోతుందో? అని ఆలోచన కలుగక మానదు.







