ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే హెచ్చరించారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, రోజా హేమాహేమీలున్న జిల్లాలతో పాటు జగన్ సొంత జిల్లా కడపతో సహా పలు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరిగాయి.
కడపలో 8 మున్సిపాలిటీలలో బద్వేల్, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, యెర్రగుంట్ల ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో టీడీపి 5, బిజేపి ఒకటి దక్కించుకున్నాయి. జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాలిటీలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని తాజా సర్వేలు చెపుతున్నాయి.
నవంబర్ 1న కడప మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయి. దానిని కూటమి దక్కించుకుంటే, జగన్-వైసీపీ కంచుకోట బద్దలు కొట్టినట్లే!
మాట తప్పని, మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి ఈ ఏకగ్రీవాలకు సదరు సీనియర్ నేతలను బాధ్యులను చేసి, వచ్చే శాసనసభ ఎన్నికలలో పక్కన పెడతారా?అలాగే ఇది జగన్‌కు కూడా వర్తిస్తుంది. కనుక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా పులివెందుల టికెట్ పార్టీలో మరొకరికి అప్పగిస్తారా?అంటే కాదనే అందరికీ తెలుసు.
ఈ ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమికి గ్రౌండ్ ప్రిపేర్ చేసేశారు. తర్వాత ఓటమికి బలమైన కారణాలు కనుగొన్నారు. కనుక ఈ ఓటమిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పద్దులోనే వ్రాయకుండా ఉండరు. ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని చెప్పుకోకుండా ఉండరు. ఓడినా ఎప్పుడూ గెలుస్తూ ఉండడటమే వైసీపీ ప్రత్యేకత.





