“గురు” షాక్ ఇస్తున్నాడు గురూ…!

Guru Katamarayuduఎప్పుడైతే “బాహుబలి 2” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైందో, మరో సినిమా గురించి ఆలోచించడం ప్రేక్షకులు మరిచిపోయారు. అంతలా ఆ సినిమా ట్రైలర్ వీక్షకులను, సినీ ప్రేమికులను కట్టిపడేసింది. చూస్తే ‘బాహుబలి 2’నే చూడాలి అనే విధమైన టాక్ ను సొంతం చేసుకున్న ‘బాహుబలి 2’ ట్రైలర్ ప్రభావంతో, ఏకంగా భారీ క్రేజ్ గల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “కాటమరాయుడు” సినిమానే ధియేటర్ల ముందు వెలవెలబోయింది. రొటీన్ మాస్ మూస సినిమాగా విడుదలైన ‘కాటమరాయుడు’ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదుర్స్ గానీ, ఆ తర్వాత అంతా బెదుర్సే!

దీంతో ఏప్రిల్ నెలాఖరున విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ వచ్చే వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ ఫలితం ఇలాగే ఉంటుందని ట్రేడ్ పండితులు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ… గత వారం విడుదలైన విక్టరీ వెంకటేష్ “గురు” సినిమాకు ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరధం పడుతున్నారు. వీక్షకులకు కొత్తదనాన్ని పంచడంలో చిత్ర యూనిట్, విక్టరీ వెంకటేష్ సఫలం కావడంతో, ‘గురు’ గల్లాపెట్టి కళకళలాడుతోంది. ‘బాహుబలి 2’ వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో, ప్రస్తుతం ‘గురు’దే హవా అంతా!

ADVERTISEMENT

నిజానికి ‘గురు’ సక్సెస్ ఊహించింది కాదు. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో పెద్దగా ఆడింది లేదు. దీంతో హిట్ టాక్ వచ్చినా గానీ, ‘యావరేజ్’ మార్క్ సక్సెస్ ను మాత్రమే చవిచూస్తుందని భావించారు. కానీ, అందరికీ షాక్ ఇస్తూ అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతోంది. ‘కాటమరాయుడు’కు ‘గురు’కు ఒక వారం మాత్రం తేడానే అయినా, చాలా సెంటర్లలో పవన్ సినిమాకు మించిన వసూళ్లు రాబడుతుండడం విశేషం. దీంతో ‘అజాత శత్రువు’ వెంకీ స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పినట్లయ్యింది. వీకెండ్ లోనే కాక, ప్రధాన సెంటర్లలో వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్స్ తో ‘గురు’ సత్తా చాటుతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories