తేజా సజ్జా స్టార్ హీరో కాదు. బాల నటుడుగా ఓ డజను సినిమాలు చేసినప్పటికీ హీరోగా నాలుగు సినిమాలే చేశాడు. ప్రశాంత్ వర్మ కూడా స్టార్ డైరెక్టర్ కాదు. ఇద్దరూ కలిసి నాలుగైదు సినిమాలు చేశారంతే. అలాంటి వాళ్ళకి నిర్మాతలు దొరకడమే కష్టం.
కానీ చేసిన ఆ నాలుగైదు సినిమాలతో ఇద్దరూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఓ స్టార్ హీరో సినిమాలో డ్యాన్స్ సెట్ కోసం చేసే ఖర్చుతో వాళ్ళిద్దరూ కలిసి ‘హనుమాన్’ సినిమా తీసేశారు. అది ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఈరోజుల్లో ఆ మాత్రం కలెక్షన్స్ ఏదో విదంగా సాధించవచ్చు. కానీ థియేటర్లలో బొమ్మ నిలబెట్టడమే చాలా కష్టం. జనవరిలో సంక్రాంతికి విడుదలైన మూడు పెద్ద సినిమాలు అప్పుడే ఓటీటీలోకి రావడం వెళ్లిపోవడం కూడా జరిగింది.
కానీ ఓటిటి ఫ్యాన్స్ వెయింటింగ్ ఇక్కడ అని చెపుతున్నప్పటికీ థియేటర్లు మాత్రం హనుమాన్‌ని విడిచిపెట్టడం లేదు. దీంతో థియేటర్లలో 50 రోజులు ఆడిన తెలుగు సినిమాగా నిలిచిపోతోంది.
ఒకప్పుడు, అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, చిరంజీవి వంటివారి సినిమాలు 100 రోజులు ఆడటం కామన్. 50 రోజులు ఆడటం చాలా చాలా కామన్. కానీ ఇప్పుడు ఎన్ని వందల కోట్లు పెట్టి తీసిన సినిమాకైనా ‘లాకిన్ పీరియడ్’ 30 రోజులకు మించి ఉండటం లేదు… అనేకంటే థియేటర్లలో నిలబడలేకపోతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ కేవలం రూ.45 కోట్లు బడ్జెట్‌తో తీసిన హనుమాన్ 50 రోజుల రికార్డ్ సొంతం చేసుకొంది.
చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోలలాగ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మా సినిమా సూపర్ హిట్ అవుతుందని తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ చెప్పుకోలేదు. కానీ థియేటర్లలో చాలా కాలం ఆడుతుందని ముందే నొక్కి చెప్పారు. అప్పుడు ఎవరూ వారి మాటలని నమ్మకపోయినా ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. ఆనాడు వారిద్దరినీ ఎద్దేవా చేసినవారు, కనీసం ఇప్పుడు వారి గురించి, వారి సినిమా గురించి నాలుగు మంచి ముక్కలు వ్రాసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే బాగుంటుంది.
సినిమా విజయానికి కలెక్షన్స్ కొలమానంగా ఉన్న ఈరోజుల్లో, కధ, ప్రేక్షకుల అభిమానమే కొలమానం అని నిరూపించారు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి తెలుగు సినిమాలో ఓ కొత్త అధ్యాయంతో పాత రికార్డుని అధిగమిస్తున్నందుకు చాలా సంతోషం. అభినందనలు!




