వైల్డ్ క్రైమ్ డ్రామాలో తడబడిన అడుగులు

Hidimbha Movie Reviewహాలీవుడ్లో క్యానిబల్స్, జాంబీల మీద విపరీతమైన సినిమాలొచ్చాయి. హద్దుల్లేని వయొలెన్స్, మనుషులను దారుణంగా హింసించి చంపే క్రూరత్వాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే హాస్టల్, సా, రాంగ్ టర్న్, హిల్స్ హ్యావ్ అయిస్ లాంటివి విపరీత ఆదరణ దక్కించుకుని బోలెడు సీక్వెల్స్ వచ్చాయి. మన ఆడియన్స్ సున్నితత్వానికి అవి సరిపడవు కాబట్టే ఆ జానర్స్ ని టచ్ చేయలేదు.

క్రమంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఇప్పుడెందుకు అలాంటిది ట్రై చేయకూడదన్న ఆలోచన దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటికి వచ్చింది. సిటీలో కిడ్నాప్ కు గురవుతున్న అమ్మాయిల కేసుని చేధించడానికి హీరో హీరోయిన్ రంగంలోకి దిగుతారు. దీనికి ఒకప్పుడు మనుషులను తినే హిడింబ ఆటవిక జాతికి సంబంధం ఉందని తెలుసుకుని దాన్ని చిక్కుముడిని విప్పడమే స్టోరీ.

ADVERTISEMENT

హిడింబకొచ్చిన ప్రధాన ఇబ్బంది కమర్షియల్ సూత్రాలకు లోబడటమే. అశ్విన్ కి ఎలాంటి ఇమేజ్ లేదు. అయినా సరే సాహసోపేతంగా బోయపాటి శీను రేంజ్ లో ఫైట్లు చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసిన కాసేపటికే అవసరం లేని ప్రేమకథ, కామెడీ జోకులు దూసుకొస్తాయి. లెన్త్ కోసం తప్ప ఇవెందుకూ పనికి రాలేదు. సీరియస్ సబ్జెక్టులోకి ఎంటర్ టైన్మెంట్, లవ్ జొప్పించడం వల్ల వచ్చిన తిప్పలివి.

అమ్మాయిలను వెతికే క్రమంలో అభయ్, ఆద్యలు ఫాలో అయ్యే ప్యాట్రన్ ఎన్నో సినిమాల్లో చూసినట్టే ఉంటుంది తప్ప ఎలాంటి ప్రత్యేకత అనిపించదు. హిడింబ మాస్కు వెనుక ఉన్న సస్పెన్స్ కోసం ఎదురు చూస్తున ఆడియన్స్ కి ఇదంతా బోర్ కొట్టే వ్యవహారమే. కాలాబండ ప్రాంతంలో ఒక హై వోల్టేజ్ ఫైట్ పెట్టడం ద్వారా అశ్విన్ లో హీరోయిజం ని బలంగా జొప్పించే ప్రయత్నం జరిగింది.

సరే మొదటి గంట ఏదోలా నెట్టుకొచ్చినా సెకండ్ హాఫ్ కు కావాల్సిన ఆసక్తిని తక్కువ మోతాదులో అయినా సరే ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తుంది. హిడింబ తాలూకు నేపధ్యాన్ని చాలా ఇంటెన్స్ తో చూపించిన అనిల్ కృష్ణ అక్కడ అవసరానికి మించిన నిడివి పెట్టినప్పటికీ టార్గెట్ చేసుకున్న ప్రేక్షకులకు అదేమంత మైనస్ అనిపించదు. ఎప్పుడైతే ఇది ముగిసిపోతుందో అక్కడ వచ్చింది అసలు చిక్కు.

అవసరం లేని హడావిడితో స్టోరీ క్లైమాక్స్ వైపు పరుగులు పెడుతుంది. కొన్ని సన్నివేశాలు, ఎపిసోడ్లు కొంత జుగుప్సగా అనిపించినా ఆ బ్యాక్ డ్రాప్ కు అవి కావాలి కాబట్టి ఒప్పుకోవచ్చు. కానీ పీక్స్ కు వెళ్లాల్సిన ప్రీ క్లైమాక్స్ ఘట్టం పట్టాలు తప్పడం మొదలుపెట్టడంతో కావాల్సిన మోతాదులో థ్రిల్ లేక అసలు కిల్లర్ బయట పడే క్రమం కొంచెం షాకింగ్ గా కొంచెం కన్విన్స్ కానట్టుగా ఉంటుంది.

అశ్విన్ నటన కంటే ఎక్కువగా కండల మీద దృష్టి పెట్టడంతో దర్శకుడు కూడా వాటినే వాడుకున్నాడు. నందితా శ్వేత ప్రత్యేకంగా లేదు, ఆలా అని వృధా కాలేదు. మకరంద్ దేశ్ పాండేని మాత్రం పూర్తిగా వాడుకున్నారు. సీఎంగా చేసిన శుభలేఖ సుధాకర్ తో సహా దాదాపు అందరూ తేలిపోయారు. బోయ అనే క్యారెక్టర్ కి బిల్డప్ ఇచ్చారు కానీ అదేమంత పేలకపోగా దానికిచ్చిన ఎండింగ్ తేడా కొట్టింది.

ఓటిలో పుష్కలంగా దొరుకుతున్న కంటెంట్ కు ధీటుగా ఇలాంటి వైల్డ్ క్రైమ్ థ్రిల్లర్స్ తో జనాన్ని మెప్పించాలంటే బలమైన హోమ్ వర్క్ జరగాలి. విపరీతమైన హింస ఉన్న మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వాళ్ళను మరీ నిరాశపరచకపోవచ్చు కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం అంత సౌకర్యంగా హిడింబను రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. వికాస్ బిజిఎం వీక్ నెరేషన్ ని కాపాడుతూ వచ్చింది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కథనైతే అనిల్ కృష్ణ రాసుకున్నాడు కానీ దాన్ని స్క్రీన్ కు కన్వర్ట్ చేసే తతంగంలో మాత్రం తడబడ్డాడు.

ADVERTISEMENT
Latest Stories