సీఎం గారు… ట్విస్ట్ లు లేని శుభంకార్డు పడినట్లేనా..!

సీఎం గారు... ట్విస్ట్ లు లేని శుభంకార్డు పడినట్లేనా..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం సంబరాల్లో ముగిసిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరో 48 గంటల్లో “పుష్ప” సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు టాలీవుడ్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

ఈ జీవో రద్దు కావడంతో, ఇంతకు ముందు మాదిరి ఎలా అయితే టికెట్ ధరలను పెంచి మొదటి వారం షోలను ప్రదర్శించుకునే సౌలభ్యం లభించినట్లయ్యింది. కొంతమంది ధియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ADVERTISEMENT

అయితే ఈ గ్యాప్ లో విడుదలైన బాలకృష్ణ “అఖండ” సినిమా మాత్రం జగన్ నిర్ణయానికి బలైందని పేర్కొనవచ్చు. టికెట్ ధరల ప్రభావం గానీ, షోల నియంత్రణ గానీ… ఏదైనా ఓ 12 నుండి 18 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ లో ‘అఖండ’ లాస్ అయినట్లేనని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

అయితే కనీసం ఇప్పటికైనా మోక్షం లభించడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా నిద్రలేని రాత్రులను గడిపిన పెద్ద సినిమా నిర్మాతలకు, పంపిణీ దారులకు, ధియేటర్ ఓనర్లకు ఇక ఊరట లభించినట్లే! దీంతో ఈ వివాదానికి ‘శుభంకార్డు’ మాత్రమే ఉండాలని, ఏ మంత్రో వచ్చి ‘ఇంటర్వెల్’ అనకుండా ఉంటే చాలన్నది సినీ వర్గీయుల మాట.

ఒకవేళ ప్రభుత్వం గనుక ఇంకా ట్విస్ట్ లు ఇవ్వాలని భావిస్తే, ఈ తీర్పు పైన రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా న్యాయవాదులు పేర్కొంటున్నారు. అలాగే ‘ఓమిక్రాన్’ వంకతో మళ్ళీ కరోనా నిబంధనలు అమలులోకి తెస్తూ 50% ఆక్యుపెన్సీ వంటివి ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లుగా మీడియా వర్గాలలో పెద్ద చర్చే జరుగుతోంది.

మరీ ముఖ్యంగా ఇప్పటివరకు చూసి చూడనట్లుగా వదిలేసిన ‘ఫైర్ సేఫ్టీ’ అంశం కూడా కీలకం కానుందన్న చర్చ జరుగుతోంది. గతంలో నిర్మించిన సింగిల్ స్క్రీన్ ధియేటర్లన్నీ ‘ఫైర్ సేఫ్టీ’ నిబంధనలను అనుగుణంగా లేకపోయినప్పటికీ, గత ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వదిలేశాయి. బహుశా ఈ నిబంధన ఖచ్చితంగా అమలులోకి తీసుకువస్తే టాలీవుడ్ కు మరో జలక్ ఇచ్చినట్లే అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఏది ఏమైనా వచ్చిన తీర్పును స్వాగతిస్తూ సంతోషంలో మునిగిపోతూనే, రాబోయే పరిణామాలను కూడా అంచనా వేయడం ఏపీలో జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా ఇంకా వివాదాన్ని లాగకుండా, పెద్ద మనసుతో “శుభంకార్డు” వేస్తారని టాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories