చంద్రముఖి… 2005లో విడుదలైన ఈ చిత్రం హారర్ జోనర్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. హారర్ జోనర్ కు ఉండే ప్రత్యేకత, సూపర్ స్టార్ రజినీకాంత్ చరిష్మా, కథలో దమ్ము వెరిసి చంద్రముఖి ఒక ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. హారర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన చంద్రముఖి అప్పటి చిన్నపిల్లలుగా ఉన్న ఇప్పటి యూత్ కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.
అలాంటి చిత్రానికి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలి. అయితే అలాంటిదేం లేకుండా చంద్రముఖి2 వచ్చేస్తోంది. పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనౌత్ హీరోయిన్ గా చంద్రముఖి 2 తెరకెక్కింది. రాజమహల్ కు 17 ఏళ్ల తర్వాత వెళ్తే ఏం జరిగింది అనేది ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందింది.
అయితే చంద్రముఖి2 ట్రైలర్ కానీ, కాస్ట్ కానీ ఏదీ కూడా ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించట్లేదు. నిజానికి లారెన్స్ హారర్ జోనర్ లో ఇప్పటికే పలు చిత్రాలు చేసాడు. అయినా కానీ చంద్రముఖి2 కొంచెం కూడా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇది ఎవ్వరూ అడగని సీక్వెల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ట్రైలర్, ప్రోమోలు చూసిన దాన్నిబట్టి చంద్రముఖి2 ఒరిజినల్ కు ఆమడ దూరంలో నిలిచినట్లే ఉంది. కొన్నేళ్ల క్రితం చంద్రముఖి సీక్వెల్ అంటూ వెంకటేష్ నాగవల్లితో మన ముందుకు వచ్చాడు. దాని ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే. మరి ఇప్పుడు కొంచెం కూడా ఆసక్తి కలిగించని చంద్రముఖి2 ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.



