గత కొన్ని రోజులుగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఐ బొమ్మ , ఆ వెబ్ సైట్ యజమాని ఇమ్మడి రవి పేరు మారుమోగుతుంది.
అయితే ఇంతలా మీడియా అటెన్షన్ ను సినీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రజల ఉత్సుకతను గ్రాబ్ చేసిన ఈ ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా.? విలనా.? అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమను ఒక బొమ్మాలి లా భయపెట్టిన ఈ ఐ బొమ్మ ఒక పైరసి కంటెంట్ వెబ్ సైట్. అయితే ఈ ఐ బొమ్మ కేవలం ఒక్క టాలీవుడ్ ను మాత్రమే కాదు మొత్తం సినీ ఇండస్ట్రీనే కంగారు పెట్టింది.
ఎన్నో కోట్లు వెచ్చించి ఒక సినిమాను తెరకెక్కించి దాన్ని వెండితెర మీద ఆవిష్కరించించే లోపే ఆ మూవీ హెచ్డీ ప్రింట్ ఈ ఐ బొమ్మలో దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు.
అలాగే అటు థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటలకే ఆ మూవీ ప్రింట్ ఈ ఐ బొమ్మ వెబ్ సైట్ లో ఉచితంగా అందరికి అందుబాటులోకి వచ్చేసేది. అయితే ఇక్కడ సినీ ప్రేక్షకుడి దృష్టీలో ఇది ఒక నేరంగా పరిగణించబడలేదు.
వేలు ఖర్చు పెట్టి కుటుంబసమేతంగా సినీ థియేటర్ కు వెళ్లి మూవీ ని ఆస్వాదించలేని చాలామందికి ఈ ఐ బొమ్మ ఒక సాధనంగా మారిపోయింది. అలాగే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ అంటూ పైడ్ ఓటిటి సర్వీసులు తీసుకోలేని వారికి సైతం ఐ బొమ్మ ఒక అవకాశంగా తయారయ్యింది.
వీరి దృష్టిలో ఐ బొమ్మ తమకు ఉచితంగా వినోదాన్ని అందించిన ఒక సాధనంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ కొన్ని వందల కోట్లు వెచ్చింది, ఒక చిత్రాన్ని తెరకెక్కించే సినీ పరిశ్రమకు మాత్రం ఈ ఐ బొమ్మ ఒక విలన్ అనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క పైరసి వెబ్ సైట్ ద్వారానే టాలీవుడ్ ఏటా కొన్ని వందల కోట్ల నష్టాన్ని చవి చూస్తుంది.
తమ కష్టాన్ని, తమ శ్రమని, తమ సొమ్ముని ఐ బొమ్మ రవి తన అతితెలివితో దోచుకుంటున్నారు అంటూ సినీ పరిశ్రమ యావత్తు రవి పై అతని చర్యల పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇదిలా ఉంటే శివాజీ వంటి యాక్టర్ రవి హాకింగ్ టాలెంట్ ను దేశ సేవకు వినియోగించుకోవాలంటూ పేర్కొన్నారు.
సినిమాలు థియేటర్లలోకి వచ్చే లోపే వాటిని హాక్ చేసి ఐ బొమ్మ వెబ్ సైట్ లో ఉచితంగా అందుబాటులో ఉంచగలుగుతున్నాడు అంటే అతని వద్ద టెక్నికల్ గా ఎంత స్కిల్ ఉండి ఉండాలి, అతని టాలెంట్ కు విలువ నివ్వాలి అంటూ కొంతమంది రవి టెక్నికల్ స్కిల్స్ పై చర్చకు జరుపుతున్నారు.
అలాగే ఉచితం అనే పేరుతో తన వెబ్ సైట్ ను వినియోగించే వినియోగదారుల డేటా ను రవి అక్రమంగా చోరీ చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమంటూ మరి కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఏదైనా దాన్ని వినియోగించే పద్దతిలోనే దాని విలువ – గౌరవం దాగి ఉంటుంది అనేది వాస్తవం.
కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది అదే కత్తి నేరస్తుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది, అలాగే ఆయుధాలు సైనికుడి చేతిలో ఉంటే దేశానికి రక్షణ అదే సైకో చేతిలో ఉంటే ఘర్షణ, అలాగే అధికారం కూడా అర్హత ఉన్నవాడి చేతిలో ఉంటేనే అభివృద్ధి లేదంటే విధ్వంశమే.
ఇక నీరు కూడా శంఖం లో పోస్తేనే తీర్ధం అవుతుంది అలాగే టాలెంట్ కూడా మంచికి వాడితేనే విలువ – గౌరవం దక్కుతుంది, లేకుంటే ఇలా జైళ్లు – అరెస్టులు అంటూ దొంగ పోలీస్ దాగుడుమూతలు ఆడుకోవాల్సిందే. అది ఐ బొమ్మ రవి అయినా మరేవరైనా…!






