టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి, ఒక ఊపు ఊపిన ‘గోవా బ్యూటీ’ ఇలియానా, ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది. ఒకటి, అర బాలీవుడ్ సినిమాలు మినహా దక్షిణాది చిత్రాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ అనుభూతులను నెమరువేసుకుంది.
మోడలింగ్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా ‘దేవదాసు’ సినిమా అవకాశం లభించిందని, అప్పటికి తన వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమేనని, అయితే అమెరికా ట్రిప్ ఫ్రీగా వెళ్ళవచ్చని తన మనసులో అనుకున్నానని, అందుకే ఆ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. అప్పటికి తనకు హిందీ మాట్లాడడం కూడా రాదని, సెట్స్ లో కూడా ఇంగ్లీష్ లోనే మేనేజ్ చేసానని తెలిపింది.
‘దేవదాసు’ విడుదలైన తర్వాత చిత్ర యూనిట్ తో కలిసి సినిమా చూసేందుకు ధియేటర్ కు వెళ్ళానని, ‘తన నటన చూసి ఖచ్చితంగా చెప్పులు వేస్తారని అనుకుంటూ’ ఆ సమయంలో ధియేటర్ కు వెళ్లానని, అయితే ప్రేక్షకులు నీరాజనాలు పట్టడం షాక్ కు గురి చేసిందని చెప్పుకొచ్చింది. ‘దేవదాసు’ సినిమా ఆడిందే ఇలియానా అందంతో అన్న విషయం బహిరంగమే… అంత అందం పైన చెప్పులు ఎలా వేస్తారనుకుంది..!?



