రోడ్లపై కోటి మంది గిగ్ వర్కర్స్.. గ్యారెంటీ లేని బతుకులు!

India's Gig Workers Face a Crisis Despite Labour Reforms!

దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న తరుణంలో ఓలా, ఉబర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు ‘గిగ్ ఎకానమీ’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఏదైనా సంస్థలో కొద్దిమంది పనిచేస్తున్నా కార్మికుల హక్కులు, సంక్షేమం గురించి మాట్లాడుతుంటాం. అలాంటిది లక్షలాది మంది గిగ్ వర్కర్స్ నిత్యం రోడ్లపై తిరుగుతూ పనిచేస్తున్నప్పుడు, వారి గురించి సదరు సంస్థలు, ప్రభుత్వాలు మరెంత ఆలోచించాలి?

ADVERTISEMENT

ఈ సంస్థలు యువతకు ఉపాధి కల్పించి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు అందిస్తున్నాయి. కనుక వాటి సమస్యలను ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. అదే సమయంలో వాటిలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని కూడా అస్సలు విస్మరించకూడదు. కానీ గిగ్ వర్కర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

నీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం, 2020-21లో దేశంలో 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు చేరవచ్చని అంచనా.

గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రతా కోడ్-2020 ద్వారా తొలిసారిగా చట్టపరమైన గుర్తింపు లభించింది. ఈ కోడ్ 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదనేది చేదు నిజం.

గిగ్ వర్కర్లతో కంపెనీల వ్యాపారం, ఆదాయాలు పెరుగుతున్నా చాలామందికి కనీస ఆదాయానికి భరోసా, పీఎఫ్, ఈఎస్ఐ, వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలు అందడం లేదు. పైగా పెట్రోల్, వాహన నిర్వహణ ఖర్చులు కూడా వారే భరించుకోవాల్సి వస్తోంది.

ఎక్కువ ఆదాయం కోసం గిగ్ వర్కర్స్‌ ఎండనక, వాననక, రేయనక, పగలనక పని చేయాల్సి వస్తోంది. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. కుటుంబ పోషణ కోసమే ఈ పని చేస్తున్నప్పటికీ కుటుంబంతో కలిసి గడిపేందుకు కూడా సమయం ఉండటం లేదు.

ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత ఉండటం లేదు. ఏవో కారణాలతో ప్రోత్సాహకాలు తగ్గించడం, అకస్మాత్తుగా ఐడీలు బ్లాక్ చేసి పన్లో నుంచి తొలగిస్తుంటాయి సదరు కంపెనీలు.

గిగ్ వర్కర్ల కోసం కార్మిక చట్టాలు ఉన్నప్పుడు వాటి ద్వారా వారి హక్కులు కాపాడాలి కదా? సామాజిక భద్రతా డ్ కింద ప్రకటించిన ప్రయోజనాలు వారందరికీ ఎందుకు అందడం లేదు? చట్టాలున్నా క్షేత్రస్థాయిలో అమలు ఎందుకు పూర్తిస్థాయిలో జరగడం లేదు?

కనుక గిగ్ వర్కర్లందరికీ ప్రమాద, ఆరోగ్య బీమా, పారదర్శక చెల్లింపులు కల్పించాలి. ఏ కారణం చేతనైనా ఐడీలు బ్లాక్ చేసినప్పుడు ఫిర్యాదు చేసుకునే వ్యవస్థ ఉండాలి. కార్మికుల అదనపు పని గంటలకు అదనపు ఆదాయంపై కూడా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి.

కంపెనీలకు కూడా నిర్వహణ ఖర్చులు, సాంకేతిక వ్యవస్థల నిర్వహణ, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి సవాళ్లు ఉన్నాయి. కాబట్టి కార్మికుల హక్కులను కాపాడుతూనే సంస్థలపై అనవసర భారం పడకుండా ప్రభుత్వాలు సమతుల్య విధానాలు రూపొందించాలి.

గిగ్ ఎకానమీని కేవలం ఉపాధి కల్పించే రంగంగా కాకుండా, గౌరవప్రదమైన జీవనానికి భరోసా ఇచ్చే వ్యవస్థగా తీర్చిదిద్దాలి. కంపెనీలకు వ్యాపారం, యువతకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో కార్మికుల భద్రతను విస్మరిస్తే అభివృద్ధికి అర్థం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories