టీ20 సిరీస్‌లలో వరుస పరాజయాల తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు వన్-డే ఫార్మటు లో ఉండటంతో ఓటముల పరంపరకు తెరపడుతుందని అభిమానులు ఆశించారు.
కానీ జట్టులోని మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. చివరికి ఇంగ్లాండ్ చేతిలో భారత్ 2-1తో వన్-డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత బౌలింగ్ విభాగంలోని లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి.
నిర్ణయాత్మక మూడో వన్డేలో జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ కారణంగా జట్టుకు దూరమవడం మనకు భారీ తలనొప్పిగా మారింది. అతడు లేకపోవటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అనుభవం లేని మన కుర్ర బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. మన బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్ల పై కనీస ఒత్తిడి పెట్టలేక, ఏకంగా 387 పరుగులు సమర్పించుకున్నారు.
ముఖ్యంగా జో రూట్‌ను ఈ సిరీస్ మొత్తంలో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. అతడిని ఔట్ చేయడంలో ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు. 3 మ్యాచ్లలోను నాట్-అవుట్ గా నిలిచి ఇంగ్లాండ్ జట్టుకు వెన్నుముక లా నిలిచాడు జో రూట్.
పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ వ్యూహాలను మార్చడంలో కూడా భారత్ వెనుకబడింది. ఈ అంశాలు సిరీస్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు మరోసారి పూర్తి స్థాయిలో తెరపడింది.
తన ఆటతీరు, ఫిట్నెస్ తో తాను ఇంకా భారత జట్టుకు ఎంత అవసరమో నిరూపించాడు. 2027 వన్-డే ప్రపంచకప్ వరకు తన లక్ష్యం స్పష్టంగా ఉందనే సంకేతాలను ఇచ్చాడు. అతని నిబద్ధతను, బ్యాటింగ్ ఫామ్ ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని నిన్నటి తన ఇన్నింగ్స్ తో మరోసారి తేలిపోయింది.
ఇప్పుడు భారత జట్టు ముందున్న మరో కీలక ప్రశ్న వికెట్‌కీపర్-బ్యాటర్ ఎంపిక. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో ఎవరిని స్థిరంగా కొనసాగించాలనే దానిపై స్పష్టత అవసరం. ప్రతి సిరీస్‌కు కొత్త ప్రయోగాలు చేయడం జట్టుకు మేలు చేయడం లేదు. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని, వచ్చే వరల్డ్ కప్ వరుకు అదే నిర్ణయం పై నమ్మకం ఉంచటం అవసరం.
గతంలో కూడా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మధ్య ఇలాంటి పోటీనే ఏర్పరిచింది జట్టు మేనేజ్మెంట్. అయితే వన్డేల్లో రాహుల్ తన నిలకడైన ప్రదర్శనతో జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కీలక మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి తన సామర్థ్యాన్ని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ కొత్త పోటీని సృష్టించడం అతనిపై అనవసర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో విజయవంతమైన జట్లు ఎప్పుడూ తమ సీనియర్ ఆటగాళ్లకు పూర్తి మద్దతు అందిస్తాయి. అదే సమయంలో యువ ఆటగాళ్లను కూడా సరైన సమయంలో జట్టులోకి తీసుకువస్తాయి. అనుభవం-యువశక్తి మధ్య సమతుల్యత ఉంటేనే జట్టు దీర్ఘకాలిక విజయాలను అందుకోగలదు. ప్రతి సిరీస్‌కు కొత్త కాంబినేషన్లు వెతకడం అసలు పరిష్కారమే కాదు.
భారత్ ఇప్పుడు చేయాల్సింది ఒక స్థిరమైన ప్లేయింగ్-11 ను రూపొందించి, దానిపైనే విశ్వాసం ఉంచడం. ప్రతిసారీ ఆటగాళ్లను మార్చే ‘మ్యూజికల్ చైర్స్’ విధానం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
సీనియర్లకు స్వేచ్ఛ, యువ ఆటగాళ్లకు స్పష్టమైన అవకాశాలు కల్పిస్తే జట్టు మరింత బలంగా తయారవుతుంది. రాబోయే వరల్డ్-కప్ టోర్నీను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ‘స్థిరత్వాన్నే విజయానికి ప్రధాన ఆయుధం’గా మార్చుకోక తప్పదు.




