తొలి రెండు మ్యాచ్ లలో వరుస సెంచరీలు కొట్టి ఆసీస్ బౌలర్ల భరతం పట్టిన రోహిత్ శర్మ మూడవ వన్డేలో 6 పరుగులకే అవుటయ్యారు. అయితే ఈ సారి ఆసీస్ బౌలర్లను శిఖర్ ధావన్ – విరాట్ కోహ్లి జోడి తగులుకుంది. రెండవ వికెట్ కు 119 పరుగులు జోడించిన అనంతరం ధావన్ 91 బంతుల్లో 68 పరుగులు చేసి అవుటయ్యారు. ఎట్టకేలకు ధావన్ తిరిగి ఫాంలోకి రావడం భారత్ కు కలిసి వచ్చిన అంశం.
మరో ఎండ్ లో కోహ్లి నింపాదిగా ఆడుతూ సెంచరీతో కధం తొక్కాడు. ధావన్ అవుటైన తర్వాత రేహనే సహకారంతో కోహ్లి రెచ్చిపోయాడు. మొత్తమ్మీద 117 బంతుల్లో 117 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ వేగం పెంచే సమయంలో అవుటయ్యాడు. రేహనే 55 బంతుల్లో 50 పరుగులు, ధోని 9 బంతుల్లో 23 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 300కు ముందు ఆగింది.
296 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్ ఏ విధంగా ఆ స్కోర్ ను డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. అయిదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2 వన్డేలను కోల్పోయి వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్య లాంటిది. సెంటిమెంట్ రీత్యా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కాకుండా విరాట్ కోహ్లి చేసిన సెంచరీ అయినా భారత్ కు సానుకూల ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.





