పాయింట్ల పట్టికలో దిగువ స్థాయిలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టాప్ 4లో ఉన్న పూణే రైజింగ్ జైంట్స్ కు సూపర్ షాక్ ఇచ్చారు. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పూణే ఆశలను భంగం చేయడంలో ఢిల్లీ సక్సెస్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన డేర్ డెవిల్స్ 168 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. కరుణ్ నాయర్ 64, రిషబ్ పంత్ 36 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా నమోదు కాగలిగింది. నిజానికి వీరిద్దరూ క్రీజులో ఉన్న సమయంలో 180 పరుగులకు చేరువ అవుతుందని భావించినప్పటికీ, పంత్ ఔటైన తర్వాత మళ్ళీ తిరోగమన దిశగా స్కోర్ బోర్డు కదిలింది.
అనంతరం లక్ష్య చేధనను ఆరంభించిన పూణేకు తొలి బంతికే రెహానేను పెవిలియన్ పంపి గట్టి షాక్ ఇచ్చాడు జహీర్ ఖాన్. అయితే స్టీవ్ స్మిత్ 38, బెన్ స్టోక్స్ 33, మనోజ్ తివారీ 60 పరుగులతో రాణించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. స్టోక్స్ క్రీజులో ఉన్నంతవరకు మ్యాచ్ పూణేదేనని అనుకోగా, 16వ ఓవర్లో స్టోక్స్ ఔటైన వెంటనే ధోని, క్రిష్టియన్ లు వెంటవెంటనే అవుట్ కావడంతో, పూణేకు పరాజయం తప్పలేదు. 13 మ్యాచ్ లు ఆడిన పూణే 16 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ మైనస్ లలో ఉండడంతో మరో విజయం తప్పనిసరి కానుంది.
ఇక నేడు గుజరాత్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. లేదంటే మరుసటి మ్యాచ్ ల ఫలితాలపై హైదరాబాద్ ఆధారపడే పరిస్థితి నెలకొంటుంది. అలాగే టాప్ 2లో ఉన్న ముంబై ఇండియన్స్ – కోల్ కతా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై 18 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ తో ఉండగా, కోల్ కతా 16 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ తో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం కోల్ కతా విజయం సాధిస్తే… టాప్ 2లో ముంబై, కోల్ కతా స్థానాలు ఖరారవుతాయి. లేని పక్షంలో ఉత్కంఠ ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉంది.



