సన్ రైజర్స్ సీరియస్… ముంబై లైట్..!

IPL-2017-Sunrisers-Hyderabad-vs-Mumbai-Indiansఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాలుగవ స్థానం కోసం హైదరాబాద్ – పంజాబ్ జట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొనడంతో, ముంబైపై సన్ రైజర్స్ తప్పక గెలవని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ చాలా లైట్ గా తీసుకుందన్న విషయం ‘టాస్’తోనే తేలిపోయింది. ఈ సీజన్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ను ఎంచుకోవడం పరిపాటిగా మారిన తరుణంలో… ఇందుకు విరుద్ధంగా ముంబై బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడంతోనే సన్ రైజర్స్ గెలుపు తధ్యం అన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి.

ADVERTISEMENT

దీనికి తోడు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన వివరణ ఏమిటంటే… ఈ సీజన్ లో ఎక్కువ శాతం చేజింగ్ ల ద్వారానే విజయాలు సాధించాం, అందుకే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసి జట్టు పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం అంటూ చెప్పడం విశేషం. అంటే ఈ మ్యాచ్ లో ఓ ప్రయోగంలా ‘లైట్’ తీసుకున్న విషయం రోహిత్ శర్మ టాస్ దగ్గరే చెప్పేసాడు. మరో వైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో మొదటి బంతి నుండి హైదరాబాద్ జట్టు చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ కు చేదు అనుభవం తప్పలేదు.

రోహిత్ చెప్పినట్లుగా ముందుగా బ్యాటింగ్ చేసి కేవలం 139 పరుగుల పేలవమైన స్కోర్ ను నమోదు చేసింది ముంబై. ఇక హైదరాబాద్ విజయం లాంచనమే అని తేలడంతో మ్యాచ్ పై ప్రేక్షకులకు ఆసక్తి పోయింది. డేవిడ్ వార్నర్ ఆదిలోనే అవుట్ అయినప్పటికీ, శిఖర్ ధావన్, హేన్రిక్స్ లు జట్టును విజయతీరాలకు చేర్చడంలో సక్సెస్ సాధించారు. హేన్రిక్స్ 44 పరుగులు చేసి అవుటవ్వగా, ఆ తర్వాత యువరాజ్ 9 పరుగులకే ఔటైనప్పటికీ, ఓపెనర్ ధావన్ 62 పరుగులతో నాటౌట్ గా నిలిచి సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు. దీంతో మరో మ్యాచ్ చేతిలో ఉండగా, హైదరాబాద్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి.

నేడు కోల్ కతా – పంజాబ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధిస్తే… టాప్ 4 ప్లే ఆఫ్స్ పై స్పష్టత వచ్చేసినట్లే. ముంబై, కోల్ కతా, పూణే, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ బరిలో నిలుస్తాయి. అలా కాకుండా పంజాబ్ సత్తా చాటితే మాత్రం హైదరాబాద్ వేచిచూడక తప్పదు. మరో వైపు పంజాబ్ చేతిలో మూడు మ్యాచ్ లు ఉండగా, మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే… టాప్ లో ఉన్న ఏదొక జట్టుకు షాక్ తగిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories