అమెరికా-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో ఎందుకు దాడులు చేస్తోంది? అంటే ఆ దేశాలు తమ భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు చోటు ఇచ్చిన పాపానికే అని చెప్పక తప్పదు.
అవి ఇలాంటి యుద్ధ భయంతోనో లేదా అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గో అమెరికాకు చోటు ఇచ్చాయి. కనుక అమెరికా వాటికి రక్షణ కల్పించాలి కదా? కానీ అమెరికా ప్రాధాన్యత ఎల్లప్పుడూ స్వీయరక్షణ, స్వీయ ప్రయోజనాలకే.
కనుక ఇరాన్ క్షిపణులు తమ సైనిక స్థావరాలపై పడకుండా జాగ్రత్త పడుతోంది తప్ప తమకు చోటు ఇచ్చిన ఆ దేశాలపై కురుస్తున్న క్షిపణుల వర్షాన్ని అమెరికా పూర్తిగా అడ్డుకోవడం లేదు… అని అంటే చాలా మందికి కోపం రావచ్చు.
అదే.. అమెరికా మీద ఇరాన్ ఇలాగే క్షిపణుల వర్షం కురిపిస్తే వాటిలో ఒక్కటైనా అమెరికా గడ్డను తాకనిస్తుందా? అంటే తాకనివదని వేరే చెప్పక్కరలేదు. అంతెందుకు… ఇంతవరకు అమెరికాకు చెందిన ఒక్క పెద్ద యుద్ధనౌకని ఇరాన్ టచ్ చేయలేకపోతోంది కదా?
కనుక గల్ఫ్ దేశాలు తమకు సంబంధం లేని ఈ యుద్ధంలోకి తమ ప్రమేయం లేకుండానే లాగబడ్డామని లోలోన బాధపడకుండా ఉండవు. ముఖ్యంగా వ్యాపారాలు, వినోదాలకు దుబాయ్, అబుదాబీ, బహ్రెయిన్, మక్కా, మదీనా కలిగిన ఇస్లామిక్ దేశంగా, పరిశ్రమలు, చమురు ఉత్పత్తికి కేంద్రంగా సౌదీ అరేబియా గుర్తింపు కలిగి ఉన్నాయి.
అలాంటి దేశాలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేస్తుంటే, భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటే, అవి ఇరాన్‌ని కూడా తప్పు పట్టలేకపోతున్నాయి. తమకు రక్షణ కల్పిస్తుందనుకున్న అమెరికాని కూడా అవి నిలదీయలేకపోతున్నాయి.
కానీ ఈ యుద్ధం ఇలాగే మరి కొన్ని వారాలు సాగితే, గల్ఫ్ దేశాల చమురు వ్యాపారాలకు, ప్రశాంతతకు భంగం కలుగుతుంటే, ఇలాగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటే, ఏదో రోజు అమెరికా స్థావరాలు ఖాళీ చేయమని చెప్పవచ్చు. ఇరాన్, ఇరాక్‌లను కలుపుకొని గల్ఫ్ దేశాలు ఒక్కటిగా మారవచ్చు.
గల్ఫ్ దేశాలు తలుచుకుంటే అమెరికాకు ఇంకా చాలా రకాలుగా నష్టం కలిగించగలవు. ఈ విషయం ట్రంప్‌కి చాలా బాగా తెలుసు. అందుకే మొదట ఎంత కాలమైన యుద్ధం చేస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు వీలైనంత త్వరగా ముగిద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ ఒప్పుకోవడం లేదు! యుద్ధం మేమే ముగిస్తాము… మా షరతులకు అంగీకరిస్తే! లేకుంటే యుద్ధం చేసుకుంటూనే ఉందామని సవాల్ విసురుతోంది.
కనుక నేరకపోయి ఇరాన్ జోలికి వెళ్ళిన ట్రంప్ ఇప్పుడు కాలికి, చేతికి అంటిన చమురు జిడ్డుని ఏదో విధంగా వదిలించుకోక తప్పదు. కానీ ఎలా? హలో మోడీజీ ప్లీజ్ హెల్ప్!







