‘ఇరుముడి’ సినిమా రివ్యూ: నటుడు రవితేజ పునః పరిచయం!

Ravi Teja in Irumudi movie

చిత్రం: ఇరుముడి

M9 రేటింగ్: 2.75/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఆగస్ట్ 21, 2026

తారాగణం: రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియ భవానీ శంకర్, సాయికుమార్, రమేష్ ఇందిరా తదితరులు

నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్

దర్శకత్వం: శివ నిర్వాణ

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

నిర్మాత: నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్

ఛాయాగ్రహణం: విష్ణు శర్మ

కూర్పు: ప్రవీణ్ పూడి

ఆరు వరుస డిజాస్టర్ల తర్వాత రవితేజ కాస్త రూటు మార్చి నటించిన చిత్రం “ఇరుముడి”. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే మంచి పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ కూడా సినిమా మీద మంచి ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమా అదే స్థాయిలో అలరించిందా? హీరోగా రవితేజ హిట్టు కొట్టాడా? అనేది చూద్దాం..!!

కథ:

సీలేరు పక్కన పొల్లూరు అనే గ్రామంలో తనకున్న రెండెకరాల అరటి తోటను సాగు చేసుకుంటూ, ఆ అరటిపళ్లను స్వయంగా ఆటోలో తిప్పుతూ అమ్ముకుంటూ.. తనను నమ్మి ఇంటిని వదిలేసి వచ్చిన భార్య (ప్రియ భవానీ శంకర్), మూడేళ్లకు పుట్టిన ముద్దులపట్టి మణికంఠ (బేబీ నక్షత్ర)ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, శ్రావణ మాసంలో 41 రోజులపాటు అయ్యప్ప స్వామి మాల వేసుకొని దైవ సన్నిధిలో సంతోషంగా బ్రతికేస్తుంటాడు త్రినాథ్ (రవితేజ).

త్రినాథ్ ఎంతో జాగ్రత్తగా కట్టుకున్న ప్రపంచం ఒక్కసారిగా కొప్పకూలుతుంది. దాన్ని అతడు ఎదిరించాడు? అనేది “ఇరుముడి” కథాంశం.

నటీనటుల పనితీరు:

రవితేజను చివరిసారి ఒక పర్ఫార్మర్ గా చూసిన సినిమా ఏదీ అని ఒక్కసారి అతని ఫిల్మోగ్రఫీ చెక్ చేస్తే.. ఎప్పుడో 2009లో వచ్చిన కిక్ మాత్రమే కనిపించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో రవితేజ పెర్ఫార్మెన్స్ ను కొన్ని సన్నివేశాల వరకు ఎంజాయ్ చేసామే కానీ.. పూర్తిస్థాయి నటుడిగా మాత్రం మెప్పించలేకపోయాడు. ఆ లోటు తీచిన సినిమా ఇరుముడి.

కూతుర్ని మాత్రమే కాదు భార్య తప్ప ప్రతి ఆడపిల్లలోనూ కూతుర్ని చూసుకునే ఓ సగటు తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. రవితేజ చేయని ఎమోషన్ లేదు కానీ.. ఈ సినిమాలో బాధను/బాధ్యతను గుండెల్లో ఒడిసిపట్టుకునే విధానం ఆశ్చర్యపరుస్తుంది. రవితేజ ఎంత గొప్ప నటుడు అనేది ప్రస్తుత తరానికి పరిచయం చేసే చిత్రమిది. రవితేజ టాప్ 5 పెర్ఫార్మెన్సుల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది.

బేబీ నక్షత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు లాంటిది. ఆమె కళ్ళల్లో స్వచ్ఛత, బాడీ లాంగ్వేజ్ లో నవ్యత చూడముచ్చటగా ఉన్నాయి. ఆమె పాత్రలో లేదా ఆమెలో తమ బిడ్డను చూసుకుంటారు ప్రేక్షకులు అంత బాగా నటించింది, కనిపించింది.

ప్రియ భవానీ శంకర్ కి పెద్ద పాత్ర లేకపోయినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. సాయికుమార్ క్యారెక్టర్ ఆర్క్ సరిగా లేకపోయినప్పటికీ.. ఆయన పెర్ఫార్మెన్స్ తో నెట్టుకొచ్చాడు. కన్నడ రమేష్ ఇందిరా పాత్రను సరిగా వర్కవుట్ చేయలేదు. జబర్దస్త్ షోస్ లో లేడీ గెటప్ లో కనిపించే కొమరయ్య అనే ఆర్టిస్టుతో చేయించిన పాత్ర బాగుంది. ఆ ఆర్టిస్ట్ ను ఆ రోల్ కోసం తీసుకోవడం మంచి చాయిస్.

సాంకేతికవర్గం పనితీరు:

తెలుగులో ఇదివరకు “లైగర్” సినిమాకి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించిన విష్ణు శర్మ కెమెరా వర్క్ “ఇరుముడి”కి మెయిన్ హైలైట్. కలర్ టోన్ నుండి గ్రేడింగ్, లైటింగ్ వంటి అన్నీ విషయాల్లోనూ మంచి కేర్ తీసుకున్నాడు. అతను మలయాళీ టెక్నీషియన్ కావడంతో, మలయాళ సినిమా ఫీల్ వచ్చిందా లేక శివ నిర్వాణ ఛాయిస్ అదా అనేది తెలియదు కానీ.. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అయితే ఇవ్వగలిగాడు.

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. మ్యూజిక్ తో ఎమోషన్ ను డామినేట్ చేయకుండా ఆండర్ ప్లే చేశాడు. అందువల్ల సన్నివేశంలోని ఎమోషన్ కు ప్రేక్షకులు అంతర్లీనంగా కనెక్ట్ అయిపోతారు.

ఆర్ట్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ అందరూ సినిమాలో అథెంటిసిటీ కోసం చాలా కష్టపడ్డారు. అదంతా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా తక్కువ లొకేషన్స్ ను డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేసి ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండా కేర్ తీసుకున్నారు.

దర్శకుడు శివ నిర్వాణ ఎంచుకున్న కథ తెలిసిందే అయినప్పటికీ.. ఆ కథను డీల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా.. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ను అద్భుతంగా పండించాడు. ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవసరం లేని బాండింగ్ కాబట్టి.. డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో రవితేజ-నక్షత్ర మధ్య తెరకెక్కించిన ఎమోషనల్ సీన్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది.

ఇక క్లైమాక్స్ లో అదే బాండింగ్ ను ముగించిన విధానం కచ్చితంగా కన్నీళ్లు పెట్టిస్తుంది. తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ లో ఎక్కడా పరిధి దాటకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా డీల్ చేశాడు. అయితే.. సినిమాకి చాలా కీలకమైన విలనిజాన్ని, దాని తాలూకు ఛాయలను డౌన్ ప్లే చేయడానికి చేసిన ప్రయత్నం మాత్రం సత్ఫలితాన్నివ్వలేదు. మరీ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ క్యాస్టింగ్ పెద్ద మైనస్. ఆ విషయంలో కాస్త రిస్క్ తీసుకుని మరో పాజిటివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెట్టి ఉంటే బాగుండేది.

అలాగే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని డీల్ చేయడంలో తడబడ్డాడు శివ నిర్వాణ. ఏ సన్నివేశంలో ట్విస్ట్ ఇవ్వాలి, ఏ సన్నివేశం తర్వాత ట్విస్ట్ రివీల్ అవ్వాలి అనే విషయంలో కంగారుపడ్డాడు. అందువల్ల.. సినిమాతో థ్రిల్ అనేది వర్కవుట్ అవ్వలేదు. దీనికి తోడు విలనిజం కూడా సరిగా ఎలివేట్ అవ్వకపోవడంతో ఎమోషనల్ గా పీక్ స్టేజ్ కి వెళ్లాల్సిన సినిమా డీసెంట్ లెవల్లో ఆగిపోయింది. అయితే.. ఇన్నాళ్లుగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయిన శివ నిర్వాణ.. “ఇరుముడి”తో మాత్రం తన సత్తాని, తన మార్క్ కి ఘనంగా ప్రూవ్ చేసుకున్నాడు.

విశ్లేషణ:

“రవితేజ సినిమా కదా పెద్దగా ఏముంటుందిలే?!” అని ప్రేక్షకులు లైట్ తీసుకునే స్టేజ్ కి వచ్చేసారు జనాలు. తన చాయిస్ లతో రవితేజ హీరోగా, నటుడిగా తన క్రెడిబిలిటీకి స్వయంగా చేసుకున్న డ్యామేజ్ అది. అయిదేళ్లుగా కనీసం డీసెంట్ సినిమా ఇవ్వలేకపోయాడు. అందుకే జనాలు రవితేజను లైట్ తీసుకున్నారు. ఆ క్రెడిబిలిటీని, రవితేజలోని నటుడ్ని ప్రేక్షకులకి సుపరిచితం చేసిన సినిమా “ఇరుముడి”.

కూతుర్ని ఎలా పెంచాలి అనే విషయాన్ని ఎక్కడా కూడా ఏదో మెసేజ్ ఇస్తున్నట్లుగా కాకుండా.. అర్థవంతంగా, హార్డ్ హిట్టింగ్ గా చెప్పాడు శివ నిర్వాణ. మాస్ మహారాజా రవితేజ కాదు నటుడు రవితేజ విశ్వరూపం చూపించిన సినిమా ఇది. కచ్చితంగా ఒక డిఫరెంట్ & రూటెడ్ సినిమా చూసిన భావన కలిగిస్తుంది.

అయితే.. రవితేజ నుండి విభిన్న సినిమాలు రావు అని గగ్గోల పెట్టి ప్రేక్షకులు.. “ఇరుముడి” లాంటి సినిమాల్ని థియేటర్లలో చూసి, ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకాన్ని హీరో రవితేజకి, నిర్మాతలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే మాత్రం ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం చేయలేక.. రొడ్డకొట్టుడు సినిమాలే చేయాల్సి/తీయాల్సి వస్తుంది.

ఓవరాల్ గా.. నటుడు రవితేజ పునః పరిచయం!

M9 రేటింగ్: 2.75/5

ADVERTISEMENT
Latest Stories