శాటిలైట్ సినిమా మసకబారుతోంది

Is Satellite Cinema has Fadingఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చిన మిస్టర్ పెళ్ళాం మీరు కనక చూసుకుంటే అందులో ఒక సీన్ ఉంటుంది. ఆమని భర్త రాజేంద్ర ప్రసాద్ కు తెలియకుండా టీవీ కొనేసి అందులో సినిమా పెడితే మొత్తం కాలనీ జనమంతా వచ్చేసి వాళ్ళింట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అక్కడే కానిచ్చే టైపు లో హడావిడి చేస్తారు. వారానికో మూవీ అది దూరదర్శన్ లో వచ్చిన కాలంలో ప్రతి ఇల్లు ఇలాగే ఉండేది. కేబుల్ టీవీ వచ్చాక రోజుకు రెండు మూడు ప్రసారం చేసేవాళ్ళు. కొత్త చిత్రం ఏదైనా సరే ఏడాది తర్వాతే ఒరిజినల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేది. శాటిలైట్ ఛానల్స్ ప్రవేశించాక ప్రీమియర్ రూపంలో కొత్త పోకడ ప్రవేశించింది.

ఈటీవీ జెమినిలు ప్రారంభమైన కాలంలో సీరియల్స్, కొత్త సినిమాలు, రియాలిటీ షో, మూవీ బేస్డ్ ప్రోగ్రాంలు విస్తృతంగా రావడంతో మెల్లగా ఎంటర్ టైన్మెంట్ స్వరూపమే మారిపోయింది. షోలే మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు దేశంలో దాదాపు కర్ఫ్యూ విధించినట్టు జనమంతా టీవీ సెట్ల ముందు ఉండిపోయారు. అడవిరాముడు, జగదేకేవీరుడు అతిలోకసుందరి, శివ లాంటి క్లాసిక్స్ ప్రసారమైనప్పుడు పనులన్నీ పూర్తి చేసుకుని ఆ టైంకి బుల్లితెర ముందు వాలిపోయేవారు. క్రమంగా డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి ఛానళ్ళు నిర్మాతలకు భారీ రేట్లు ఆఫర్ చేసి హక్కులు కొనడం మొదలయ్యింది. థియేటర్ కు టీవీ కు మధ్య గ్యాపూ తగ్గిపోయింది.

ADVERTISEMENT

ఒకదశలో సినిమా బడ్జెట్ లో ముప్పాతిక శాతం శాటిలైట్ డీల్స్ లోనే వచ్చేది. ప్రీమియర్ అని డేట్ అనౌన్స్ చేస్తే చాలు ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. టిఆర్పి రేటింగ్స్ దద్దరిల్లిపోయేవి. కానీ ఓటిటిలు వచ్చాక వీటి వైభవం మసకబారుతోంది. 24 రేటింగ్ నుంచి బ్లాక్ బస్టర్స్ సైతం 10 తెచ్చుకోవడానికే పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. రభస, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ ఫ్లాపులు సైతం 14 దాకా తెచ్చుకున్న ఉదంతాలు నుంచి కెజిఎఫ్ 2కి 10 రావడమే గగనమనే దాకా దిగిపోయింది. విక్రమ్ కు వచ్చింది 6 లోపే. ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకున్నా ఆర్ఆర్ఆర్ టీవీలో మాత్రం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములోని దాటలేదు.

ఈ దశ మళ్ళీ రికవర్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఓపిక తగ్గిపోయింది. ఫలానా టైంలో ఫలానా తేదీకి తాపీగా కూర్చుని యాడ్స్ ని భరించేంత సహజం వాళ్లలో లేదు. ప్రైమ్ కో నెట్ ఫ్లిక్స్ కో వెళ్ళామా, బోర్ కొట్టిందంతా ఫార్వార్డ్ చేశామా, ఒకవేళ చూడటం బాలన్స్ ఉంటే తర్వాత కంటిన్యూ చేశామా ఇలా మారిపోయారు. పైగా ఓటిటిలు ప్రొడ్యూసర్లతో అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే శాటిలైట్ లో ఎప్పుడు రావాలనేది ముందే నిర్దేశిస్తున్నారు. అందుకే వకీల్ సాబ్, రాధే శ్యామ్ లకు సదరు ఛానెల్ లక్షల ఖర్చుతో ప్రమోషన్ చేస్తే అవేవీ అద్భుతాలు చేయలేకపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక శాటిలైట్ సినిమా భవిషత్తు నామమాత్రంగా మారుతుందేమో.

ADVERTISEMENT
Latest Stories