బుల్లితెరపై సందడి చేసే ‘జబర్దస్త్’ కార్యక్రమంలో కమెడియన్ వినోద్ తెలుసా? ఇలా కాకపోతే లేడీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన కమెడియన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుకు వస్తారులేండి… అతనే వినోద్. అయితే ఈ వినోద్ కిడ్నాప్ అయ్యాడని కాసేపు… లేదు లేదు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఇంకాసేపు… ఇలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రెండు విషయాలలోనూ వాస్తవం లేదు గానీ, ఈ రెండు పుకార్లు ఒకేసారి చెలరేగడానికి మాత్రం బలమైన కారణం ఉందని తెలిసి వచ్చింది.
కడప జిల్లాకు చెందిన వినోద్ తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లాలోని సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరూ మరణించారు. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమె పెళ్లీడుకొచ్చింది. అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న ఆ యువతిని వినోద్ కు ఇచ్చి చేయాలని అతని తల్లి, ఆమె సోదరి భావించారు. ఈ నేపథ్యంలో వినోద్ ను పెద్దమ్మ లక్ష్మమ్మ నివాసానికి రప్పించి పెళ్లి చేసుకోవాలని కోరారు.
వినోద్ వారి నిర్ణయంతో విభేదించడంతో… బలవంతంగా అయినా వివాహం జరపాలని భావించారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో వినోద్ చేతికి గాయమైంది. దీంతో వినోద్ సూసైడ్ చేసుకున్నారని పుకార్లు చెలరేగాయి. ఇక కుటుంబ సభ్యులే అతనిని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా తెరపైకి వచ్చింది. సదరు సమాచారం కాస్త పోలీసులకు అందడంతో సంఘటనా స్థలికి చేరుకోగా… తననెవరూ కిడ్నాప్ చేయలేదని, అలాగే తాను కూడా ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని వినోద్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. దీంతో కధ కంచికి వినోద్ ఇంటికి వెళ్ళాడు.


