ఏపీ-తమిళనాడు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో జరిగిన వివాదంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందిస్తూ, “క్రెడిట్ చోరీ, ఓట్ చోరీ, డేటా చోరీ, చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!” అని ఎద్దేవా చేశారు.
ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించేందుకు ఏర్పాటు చేసిన ‘గైడెన్స్ తమిళనాడు’ సంస్థ నుంచి 15 మందిని ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగించిందని వార్తలు వచ్చాయి.
దీనిపై ఆ సంస్థ వెంటనే స్పందిస్తూ, “2026 జులైలో ‘గైడెన్స్ తమిళనాడు’ నుంచి ఎలాంటి సామూహిక రాజీనామాలు జరగలేదు. ఏ సంస్థలోనైనా ఉద్యోగులు మారడం సర్వసాధారణం. మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య, ప్రాంతీయ బదిలీలు, వ్యక్తిగత లేదా కుటుంబ కారణాల వల్ల కొందరు ఉద్యోగులు రాజీనామా చేశారు.
పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే విషయంలో తమిళనాడు ఎల్లప్పుడూ పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక పోటీ కొనసాగిస్తుంది. దేశ, విదేశీ పెట్టుబడిదారులు నేటికీ తమిళనాడునే ఎంపిక చేసుకుంటున్నారు,” అని గైడెన్స్ తమిళనాడు ‘ఎక్స్’లో వెల్లడించింది.
నాడు అమరావతిని పాడుబెట్టి, మూడు రాజధానులు అంటూ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆంధ్రాకు రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు తెలంగాణకు, తమిళనాడుకు తరలిపోతున్నప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం చింతించలేదు. కనుక వైసీపీ కూడా చింతించలేదు. పోతే పోనీ అని అనుకున్నారు.
కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆంధ్రాకు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తుంటే ఎలాగూ ఆయనను అభినందించలేరు. పైగా ‘క్రెడిట్ చోరీ’ అంటూ వితండవాదనలు కూడా చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జగన్ స్పందన చూస్తే, సీఎం చంద్రబాబు నాయుడు పట్ల తన ద్వేషాన్ని మరోసారి బయటపెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఈ ద్వేషంతో ఆయన ఏం చేస్తున్నా గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు.
తాను కేవలం సీఎం చంద్రబాబు నాయుడిని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని, ఆయనను మాత్రమే రాజకీయంగా ఎదుర్కొంటున్నానని జగన్ భావిస్తున్నారు. కానీ తాను రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాననే తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపిస్తున్నానని జగన్ గ్రహించినట్లు లేదు.
నాడు అన్న క్యాంటీన్లు మొదలు అమరావతి వరకు అన్నిటినీ వ్యతిరేకించినందుకే ప్రజలు తనని గద్దె దించారని జగన్‌కి బాగా తెలుసు. కానీ నేటికీ అంగీకరించడం లేదు. అది ఆయన ఇష్టం.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషంతో ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఉంటే, ఈ వైఖరే వైసీపీ పాలిట శాపంగా మారుతుంది. ‘జగన్ 2.0’ కల ఎన్నటికీ నెరవేరదని గ్రహిస్తే మంచిది.




