సినీ హీరోల ప్రతీ కొత్త సినిమాకి కొత్త పోస్టర్స్ వేస్తున్నట్లే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరిన ప్రతీసారి వైసీపీ శ్రేణులు సరికొత్త పోస్టర్ ప్రదర్శిస్తూ హడావుడి చేస్తుంటారు.
జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినప్పుడు ‘రాసిపెట్టుకోండి నెక్స్ట్ సిఎం జగన్మోహన్ రెడ్డి’, ‘ఆంధ్రాకి ఒక్కడే రారాజు’, “జగన్ మా దేవుడు,’ అని వ్రాసున్న జగన్ ఫోటోలున్న పోస్టర్స్ ప్రదర్శించారు.
ఇది వైసీపీ శ్రేణుల ‘క్రియేటివిటీ’కి నిదర్శనమని సరిపెట్టుకున్నా, వారి అత్యుత్సాహాన్ని భరించడం స్థానిక ప్రజల వల్ల కాలేదు.
వేలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు బైకులు, స్కూటీలపై వైసీపీ జెండాలు పట్టుకొని పెద్దగా హారన్లు కొడుతూ, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ సామాన్య ప్రజలకి తమ తడాకా చూపించారు.
పోలీసులు హెలిప్యాడ్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ శ్రేణులు వారిని పక్కకు తోసేసి, బ్యారికేడ్లను దాటుకొని హెలికాఫ్టర్ వద్దకు చేరుకున్నారు.
జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ శ్రేణులు పోలీసుల ఆంక్షలు ఏమాత్రం ఖాతరు చేయకుండా భారీ ఊరేగింపుగా పొగాకు వేలం కేంద్రం చేరుకున్నారు.
ఈ విచ్చలవిడితనాన్ని ‘జెన్-జీ’ ఉత్సాహంగా, జగన్‌కున్న ప్రజాబలంగా, ప్రజాదరణగా అని వైసీపీ సొంత మీడియా అభివర్ణించుకుంది. కనుక జగన్ పర్యటనలకు అర్థం, పరమార్ధం రెండూ వేరని స్పష్టమవుతోంది.
ఇలా ప్రజా సమస్యలు లేదా పరామర్శ పేరుతో జగన్ ఒక్కో జిల్లా.. ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ ప్రాంతంలో తనకున్న బలం స్వయంగా పరీక్షించుకొని, ప్రదర్శించుకోవడానికే వస్తున్నట్లనిపిస్తుంది. అలాగే ఆయా జిల్లా, నియోజకవర్గాలలో వైసీపీ నేతల జనసమీకరణ శక్తి, సామర్ధ్యాలు కూడా జగన్ స్వయంగా పరిశీలించుకుని, వచ్చే ఎన్నికలలో ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలో, ఇవ్వకూదదో నిర్ణయించుకుంటారని అనిపిస్తుంది.
తాను ప్యాలస్ గడప దాటనప్పటికీ ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటే మంచిదే. కానీ అందుకు పరామర్శలు, ప్రజా సమస్యల సాకు అవసరమా? అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది.
పొగాకు రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకే జగన్ ఈ పర్యటన పెట్టుకున్నారని అనుకున్నప్పటికీ, వైసీపీ పోస్టర్లు, బలప్రదర్శనే హైలైట్ అయ్యింది తప్ప రైతుల సమస్యలు కాదు.
పొగాకు రైతుల సమస్యల కంటే, జగన్ పర్యటన ఎంత గొప్పగా సాగింది? ఎన్ని వేలమంది వచ్చారు? ఎలా ఎంత హడావుడి చేశారు? కొత్తగా ఎలాంటి పోస్టర్ ప్రదర్శించారు? అనేదే ముఖ్యమన్నట్లు సాగింది ఈ పర్యటన.
పోలీసుల ఆంక్షలు తుంగలో తొక్కి ఆ తర్వాత మళ్ళీ మాజీ సిఎం జగన్ పర్యటనలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కూడా.
జగన్ ప్యాలస్ గడప దాటి కాలు బయట పెడితే కూటమి ప్రభుత్వం గజగజా వణికిపోతుంటుందని గొప్పగా చెప్పుకుంటారు కూడా.
జగన్, వైసీపీ శ్రేణులు, వారి సొంత మీడియా ఇలాంటి భ్రమలలో ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అయన పర్యటనల వలన ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు.
చివరిగా ఒక ప్రశ్న. నాడు జగన్ సిఎంగా ఉన్నప్పుడు బయటకొస్తే దారి పొడవునా పరదాలు కట్టించుకునేవారు. రోడ్ల పక్కన పచ్చటి చెట్లు నరికించేసేవారు. కానీ ఇప్పుడు పరదాలు లేకుండా వేలాదిమందితో బలప్రదర్శనలు చేస్తున్నారు. ఎందువల్ల? తన పాలనలో కంటే చంద్రబాబు నాయుడు పాలనలోనే జగన్ సేఫ్‌గా ఫీల్ అవుతున్నందునా?



