jai-hanuman-rishab-shetty-prasanth-varma

ఓ ఆరేళ్ళ క్రితం అంటే 2018లో ‘ఆ!’ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకులని పలకరించినప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2019లో ‘కల్కి’తో జనాలకు టచ్చులోకి వచ్చాడు. ఆ తర్వాత ‘జాంబీ రెడ్డి’ తో అందరికీ షాక్ ఇచ్చి తనని గుర్తించేలా చేసుకున్నాడు.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?

వాటి తర్వాత ‘హనుమాన్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు, ప్రశంశలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే ఓ బ్రాండ్ నేమ్… ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్!

మూడో సినిమాగా ‘జై హనుమాన్’ మొదలు పెడుతున్నారు. అది హనుమాన్ కంటే మరింత గొప్పగా ఉండబోతోందని ప్రశాంత్ వర్మ చెపుతూనే ఉన్నారు. దీపావళి కానుకగా నిన్న విడుదల చేసిన జై హనుమాన్ పోస్టర్‌, నేడు విడుదల చేసిన ‘థీమ్ సాంగ్‌’ వింటే ప్రశాంత్ వర్మ తన సినిమా గురించి తక్కువే చెప్పాడేమో? అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాయి ఆ పోస్టర్‌, థీమ్ సాంగ్‌.

Also Read – జగన్‌ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!

ఎవరూ ఊహించనివిదంగా కన్నడ నటుడు ‘రిషబ్ శెట్టి’ ఈ సినిమాలో హనుమంతుడిగా నటించబోతున్నట్లు ఆ పోస్టర్‌తోనే తెలియజేశారు.

ఇప్పుడు హనుమంతుడు అంటే అందరూ ‘సిక్స్ ప్యాక్ బాడీ’ అన్నట్లు ఊహించుకోవడం పరిపాటిగా మారింది. కానీ ప్రశాంత్ వర్మ హనుమంతుడి రూపురేఖల విషయంలో కూడా తన ప్రత్యేకతని చాటుకున్నాడు.

Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?

సాధారణంగా సినిమాలలో మన హనుమంతుడికి తోక, కోతిని పోలిన మూతి ఉంటుంది. కానీ ప్రశాంత్ వర్మ తన సినిమాలో తోకని యధాతధంగా ఉంచి, హనుమంతుడి మొహాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు.

సూర్య కిరణాల వెలుగులో ధగధగా మెరిసిపోతున్న ఆంజనేయస్వామి శ్రీరాముడి విగ్రహం పట్టుకుని కూర్చున్న పోస్టర్‌ అద్భుతంగా ఉంది. ఆ పాత్రలో రిషబ్ శెట్టి పెద్ద జుట్టు, చక్కటి మోము, గుబురు మీసాలతో చాలా చక్కగా ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపి రవిశంకర్ కలిసి జై హనుమాన్ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా స్థాయి ఎప్పుడో దాటిపోయారు. కనుక పాన్ వరల్డ్ సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెడతామని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఓ యువ దర్శకుడు 4-5 సినిమాలతోనే ఈ స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయమే కదా?